అనర్హులకు లోన్లు.. ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో బిగ్ స్కామ్..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-28 03:09:10.0  )
అనర్హులకు లోన్లు.. ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో బిగ్ స్కామ్..?
X

ఖమ్మం జిల్లా ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖలో 2021-22కు సంబంధించిన రుణాల మంజూరు ప్రక్రియలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 593మంది నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఐదు వేలకు పైగా వచ్చాయి. దరఖాస్తుదారులను జిల్లా కమిటీ ముఖాముఖి పేరుతో తూతూ మంత్రంగా ఇంటర్వ్యూ నిర్వహించింది.

ఈ దరఖాస్తులు పరిశీలించి నిష్పక్షపాతంగా యూనిట్లను కేటాయించాల్సిన ఆ అధికారి తనకు అనుకూలంగా ఉన్న వారికే కేటాయించారని తెలుస్తున్నది. ఈక్రమంలో వారి నుంచి పెద్దమొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. కొంతమంది నిరుద్యోగ ఎస్సీ యువత తప్పుడు ధ్రువపత్రాలతో లోన్లు పొందారని వీరికి ఆ అధికారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఎమ్మెల్యే అండతో ఎస్సీ సామాజిక వర్గంలోని ఓవర్గానికి ఎక్కువ సంఖ్యలో యూనిట్లు కేటాయించారని, తనకు సంబంధం లేదని ఆయన చెబుతుండటం గమనార్హం.

దిశ,ఖమ్మం సిటీ: ఖమ్మం జిల్లా ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖలో 2021-22కు సంబంధించిన రుణాల మంజూరు ప్రక్రియలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయని ఎస్సీ యువత ఆరోపిస్తున్నది. గతేడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 593 మందికి స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమి స్కిల్డ్ పేరుతో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సంక్షేమ సేవా సహకార సంస్థ ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు ఆహ్వానించగా జిల్లా వ్యాప్తంగా ఎస్సీ యువత నుంచి ఐదు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

ఈదరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా కమిటీ ముఖాముఖి పేరుతో తూతూ మంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో రూ.2లక్షలు, రూ.5లక్షలు, రూ.10లక్షల యూనిట్లకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులు పరిశీలించి నిష్పక్షపాతంగా యూనిట్లను కేటాయించాల్సిన ఆ అధికారి అంతా తానై తనకు అనుకూలంగా ఉన్న కొంత మందికి బహిరంగంగానే లోన్లు కేటాయించినట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ యువత ఆరోపిస్తున్నారు.

దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసిన అభ్యర్థికి, తాను ఏ యూనిట్‌ను ఎంపిక చేసుకున్నాడో చూసి ఆ అభ్యర్థి అర్హతలను బట్టి లోన్ కేటాయించవలసి ఉంటుంది. కానీ సదరు అధికారి ఇష్టారీతిగా తనకు అనుకూలంగా ఉన్న, రాజకీయ దరఖాస్తుదారులకు, కుల సంఘ నాయకులకు పెద్ద మొత్తంలో లోన్లు కేటాయించాడు. లోన్లు కేటాయించిన దరఖాస్తుదారులు పెద్ద మొత్తంలో ఓ ఇద్దరు కుల సంఘం నాయకుల ద్వారా అధికారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం లోన్ల ప్రక్రియలో భాగంగా సిద్ధమైన జాబితా పరిశీలిస్తే ఎస్సీ సామాజిక వర్గంలో ఓ సామాజిక వర్గానికి ఎక్కువ సంఖ్యలో లోన్లు కేటాయించారని మరో వర్గం బహిరంగంగానే ఆరోపణ గుప్పిస్తున్నారు. కాగా అక్రమ మార్గంలో లోన్లు పొందిన వారికి ఆ వర్గ ఎమ్మెల్యే ఒకరు సపోర్ట్ చేశారని, తనకేమీ సంబంధం లేదని, అధికారి అనడం కొసమెరుపు.

కొంతమంది నిరుద్యోగ ఎస్సీ యువత తప్పుడు ధృవీకరణ పత్రాలు జత చేసి, లోన్లు పొందారని జిల్లా వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో లోన్లు పొందిన ఆ యువతకు ఆ జిల్లా అధికారి ఆశీస్సులు మెండుగానే ఉన్నాయని తెలుస్తున్నది. ఈ విషయమై కలెక్టర్ జోక్యం చేసుకొని, విచారణ జరిపి, లోన్ల ప్రక్రియను రద్దుచేసి, న్యాయం చేయాలని జిల్లా ఎస్సీ యువత కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed