తెలంగాణలో ‘కండువా’ రాజకీయం! ఎమ్మెల్యేల మెడలో వేసినవి పార్టీవా.. లేక సంప్రదాయమా?

by Shiva |   ( Updated:2024-09-11 04:44:46.0  )
తెలంగాణలో ‘కండువా’ రాజకీయం! ఎమ్మెల్యేల మెడలో వేసినవి పార్టీవా.. లేక సంప్రదాయమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కండువాలు చిచ్చు పెట్టినట్లయింది. పార్టీ మార్పు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. పీఏసీ చైర్మన్ ప్రకటన తర్వాత రెండు పార్టీల్లో పొలిటికల్ వార్ ఊపందుకుంది. అర్హత లేని వ్యక్తికి పీఏసీ చైర్మన్ ఎలా ఇస్తారని.. బీఆర్‌ఎస్ లీడర్లు ప్రశ్నిస్తుండగా, ఎంపిక అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆశ్చర్యకరంగా స్పందించారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, ఆ పదవికి అర్హుడనేనని అందరికీ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్‌ను కేవలం డెవలప్‌మెంట్ కోసమే కలిశానని, ఆ సమయంలో సంప్రదాయ దేవుడి కండువా కప్పారని ఆసక్తికరంగా వెల్లడించారు.

దీంతో ఇరు పార్టీల నేతలు అవాక్కయ్యారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పారా.. లేదా దేవుడి కండువాలేనా? అని ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. సదరు ఎమ్మెల్యేలందరివీ సంప్రదాయ కండువాలేనని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. దీంతో తదుపరి స్టెప్ ఏం తీసుకోవాలని రెండు పార్టీలు రాజకీయ, న్యాయ నిపుణులతో చర్చిస్తుండటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ వ్యూహాల్లో బీఆర్‌ఎస్ దారుణంగా ఇరుక్కుంటున్నదని ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేశారు. సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వాలనే నినాదం కూడా తమ సక్సెస్‌కు కారణం అని ఓ ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు దేవుడి కండువాల విషయంలోనూ బీఆర్‌ఎస్ నాలుక కర్చుకుంటున్నదని కాంగ్రెస్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మిగతా సభ్యుల స్వరం కూడా ఇదేనా..?

బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య కండువాల రాజకీయం తెర మీదకు వచ్చింది. సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతున్నది. మూడు రంగులు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ కండువా అని భావించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో స్పందిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా ఆయా ఎమ్మెల్యేలు హస్తం కండువాల కప్పుకున్నారని బీఆర్‌ఎస్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నది. ఇలా రెండు పార్టీల మధ్య ఇప్పుడు విచిత్ర స్టయిల్‌లో వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. పైగా పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నది. దీంతో అరెకపూడి గాంధీ స్టయిల్‌లోనే మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలంతా స్వరం ఎత్తుకుంటున్నట్టు తెలిసింది.BIG News: తెలంగాణ పాలిటిక్స్‌లో ‘కండువా’ రాజకీయం! ఎమ్మెల్యేలకు మెడలో వేసినవి పార్టీవా.. లేక సంప్రదాయమా?

అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి‌లు సీఎంను ప్రత్యేకంగా కలిసి, పార్టీ‌లో చేరినట్టు గతంలో ప్రకటించారు. తాజా ఎపిసోడ్‌తో వీళ్లంతా పీఏసీ చైర్మన్ తరహాలోనే వ్యవహరించనున్నట్టు తెలిసింది. దానం నాగేందర్ మాత్రం టెక్నికల్ సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలే నొక్కి చెప్తున్నారు. కాంగ్రెస్ బీ ఫాంపై ఎంపీగా పోటీ చేయడంతోనే ఆయనకు ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ లీడర్లు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed