రాజకీయ బాంబులు.. గులాబీ దండులో గుబులు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-26 03:14:15.0  )
రాజకీయ బాంబులు.. గులాబీ దండులో గుబులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయంటూ ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ లీడర్లలో గుబులు రేపుతున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, లోపల మాత్రం తమను అరెస్ట్ చేస్తారేమోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు ఆ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. వివిధ శాఖలపై ప్రభుత్వం చేపట్టిన విచారణలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు మరికొందరు లీడర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో జరిగిన పలు అవకతవకలపై విచారణ జరిపిస్తున్నది. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఓఆర్ఆర్ టెంటర్లు, భూ కేటాయింపులు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ చేపట్టింది. ఈ కేసుల్లో కొందరు కీలక నేతలు అరెస్ట్ అవుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ప్రకటించినప్పటి నుంచి గులాబీ పార్టీ‌లో అలజడి మొదలైందని ప్రచారం జరుగుతున్నది. తాము గతంలో మంత్రిగా పనిచేసిన శాఖల్లో ఏమైనా తప్పు జరిగిందా? ఆ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అని మాజీ మంత్రులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ‘మన పార్టీలో ఫస్ట్ వికెట్ ఎవరు? కీలక నేతనే అరెస్టు చేస్తారా? అని ఆ పార్టీల్లో చర్చలు మొదలయ్యాయి.

ఫోన్ ట్యాపింగ్ గుబులు

ఫోన్ ట్యాపింగ్‌లో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్టు టాక్. వారి ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్టు విచారణలో నిందితుడిగా ఉన్న పోలీసు మాజీ అధికారులు వాగ్మూలం ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఎవరి ఫోన్‌ను ట్యాప్ చేయాలనే విషయాన్ని వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెట్టేవారని, ఆ మెసేజ్‌లను పోలీసులు సేకరించారని సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక నేతలను అరెస్ట్ చేస్తారేమోనని చర్చ జరుగుతున్నది. ఏ స్థాయి లీడర్‌ను అరెస్టు చేస్తారు? ఆ జాబితాలో మాజీ మంత్రులు ఉంటారా? లేకపోతే ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేలు ఉంటారా? అనేది ఆసక్తిగా మారింది.

భూ కేటాయింపుల్లో ఆరోపణలు

భూ కేటాయింపుల విషయంలో ఐఏఎస్ అధికారి ఆమోయ్ కుమార్‌ను ఈడీ విచారిస్తున్నది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆయన పనిచేసిన సమయంలో చట్టవిరుద్ధంగా భూములను కేటాయించినట్టు విమర్శలు వస్తున్నాయి. ఆ కేటాయింపుల్లో బీఆర్ఎస్‌కు చెందిన కొందరు కీలక నేతలు ఎక్కువగా ప్రయోజనం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో భూ కేటాయింపుల కేసులో ఈడీ ఆదేశాల మేరకు లీడర్లను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ సైతం జరుగుతున్నది.

Advertisement

Next Story