BIG News: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం..!

by Shiva |
BIG News: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో 2023 అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. ఏటా 4.50 లక్షల ఇళ్లు నిర్మించి.. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇల్లు లేని ప్రతీ పేద కుటుంబానికి ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకుంటున్నది. మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం ప్రారంభించగా.. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7,740 కోట్లు కేటాయించారు. అయితే.. పేదల ఇళ్ల పథకం కోసం రాష్ట్ర ఖజానాపై భారీగా భారం పడుతున్నది. దీంతో కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చేలా రాష్ట్రం ప్లాన్ చేస్తున్నది.

పీఎంఏవై కింద సాయం..

పేదల ఇళ్ల పథకం కోసం కేంద్ర నిధులు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు కేంద్రం విధించే నిబంధనలన్నింటినీ పాటించేందుకు అంగీకారం తెలిపింది. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటే ఇళ్ల నిర్మాణానికి పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని, రాష్ట్ర ఖజానాపై భారంపడే అవకాశం ఉండటంతో కేంద్రం నుంచి సాయం కోరుతున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోచన పథకం (పీఎంఏవై) కేంద్రం ఇళ్ల నిర్మాణానికి పెద్దఎత్తున సాయం చేస్తోంది.

సాధ్యమైనంత వరకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పీఎంఏవై నిబంధనలు పాటించడమేగాక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సమాచారం రాష్ట్రం తరఫున కేంద్రానికి అందించేందుకు సిద్ధమైంది. కేంద్రం సాయంతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొనసాగించాలని భావిస్తోంది. దీంతో కేంద్రం విధించే మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీని ద్వారా వీలైనంత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చడమే గాక.. భారీగా నిధులు రాబట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది.

గత తప్పిదాలు పునరావృతం కాకుండా..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఆశించిన మేర ఫలితాలివ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం చేపట్టినా అసంపూర్తిగానే నిలిచిపోయాయి. చాలాచోట్ల పూర్తికాలేదు. దీనికి కారణాలపై తెలంగాణ ప్రభుత్వం ఆరా తీసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలంటే ముందుగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి. కానీ.. అప్పటి కేసీఆర్ సర్కార్ ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ముందుగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది.

దాదాపు ఇళ్లు పూర్తయిన తర్వాత కూడా లబ్ధిదారుల జాబితా రూపొందించకపోవడంతో కేంద్రం తప్పుబట్టింది. దీంతో ఈ పథకానికి పీఎంఏవై సాయం అందించేందుకు నిరాకరించింది. అప్పటి ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయల సాయం కోల్పోయింది. దీంతో నిధులు సర్దుబాటుగాక రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయింది. ఇలాంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే అన్ని నిబంధనల మేరకు నడుచుకోవాలని భావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed