BIG News: బీఆర్ఎస్ నేతల ఫారిన్ పాలిటిక్స్..! విదేశీ యాత్రకు గులాబీ పార్టీ ప్లాన్

by Shiva |
BIG News: బీఆర్ఎస్ నేతల ఫారిన్ పాలిటిక్స్..! విదేశీ యాత్రకు గులాబీ పార్టీ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఫారిన్ టూర్‌కు సిద్ధమైంది. వారం పాటు విదేశాల్లో పర్యటించాలని పార్టీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలకు ఆహ్వానం అందినట్టు టాక్. వచ్చేవారం నుంచి వీరంతా టీంల వారీగా పయనం కానున్నట్టు తెలిసింది. ఈ టూర్ వెనుకున్న ప్లాన్ ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు లేని యాత్రలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది మామూలు టూరేనా? లేక రోజురోజుకూ బలహీన పడుతున్న పార్టీని కాపాడుకునే వ్యూహాలు రచించేందుకు వెళ్తున్నారా? అదే నిజమైతే ఇక్కడే మీటింగ్ పెట్టుకోవచ్చు కదా? దానికోసం ఫారిన్ టూర్ ఎందుకు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.

వలసల నివారణ కోసమా?

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరారాబాద్‌కు వచ్చాక.. ఆయన ఆధ్వర్యంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం తెలుసుకున్న గులాబీ బాస్.. వలసలను నివారించడం తోపాటు, పార్టీ నిలదొక్కుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టినట్టు టాక్. అందుకే ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీలతో ఫారిన్ ట్రిప్‌కు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీ భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలను అక్కడ వారికి వివరించడంతో పాటు, ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశాన్ని సైతం వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ట్రిప్ మధ్యలో కేటీఆర్ జాయిన్

ఈ యాత్ర డిజైన్ మొత్తం గులాబీ‌బాస్ డైరెక్షన్‌లోనే జరుగుతున్నట్టు సమాచారం. ఫారిన్ ట్రిప్‌లో ఎమ్మెల్యేలు, లీడర్లకు ఏం హితబోధ చేయాలనే అంశాలను సైతం ఆయననే పైనల్ చేశారని తెలుస్తున్నది. టూర్ మధ్యలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జాయిన్ అవుతారని సమాచారం. అక్కడే ఆయన పార్టీ భవిష్యత్ కోసం గులాబీ బాస్ తీసుకునే నిర్ణయాలను వివరిస్తారని టాక్. అలాగే ఎమ్మెల్యేల వలసల నివారణ కోసం అమలు చేసే వ్యూహాన్ని సైతం వెల్లడించే చాన్స్ ఉన్నట్టు తెలిసింది.

10 రోజుల పాటు

ఈ నెల 11 నుంచి దాదాపు పది రోజుల పాటు గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు ఫారిన్ టూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అందరూ ఒకేసారి వెళ్లకుండా 5 లేదా 6 మందితో ఒక్కో టీంను ఏర్పాటు చేశారు. ఒక టీం త్వాత మరో టీం ఇక్కడి నుంచి బయలుదేరుతుందని, ముందుగా చైనా, అక్కడి నుంచి రష్యా, చివరికి యూకేకి రీచ్ అయ్యేలా షెడ్యూలు సిద్ధం చేసినట్టు సమాచారం.

లీకుల భయం?

పార్టీ లీడర్లతో ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తే.. మీటింగ్‌లో చర్చించే అంశాలు బయటకు లీక్ అవుతాయనే భయం గులాబీ లీడర్లను వెంటాడుతున్నది. అందుకే ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశారని టాక్. విదేశాల్లో జరిగే సమావేశం వివరాలు బయటకు లీక్ అవకుండా, అందరూ రహస్యంగా ఉంచుతారనే నమ్మకం పార్టీ నేతలకు సైతం లేదు. కానీ కనీసం మనస్సు విప్పి మాట్లాడుకునే సమయం, పరస్పరం అభిప్రాయాలు పంచుకునే వెసులుబాటు ఉంటుందని ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇంతకాలం పార్టీ ఒక్కో ఎమ్మెల్యేకు ఏం చేసింది? ఏయే పదవులు కట్ట బెట్టింది? ఇప్పుడు పార్టీ మనగడ కోసం ఏం చేయాలి? అనే అంశాలపై స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయని గులాబీ లీడర్లు భావిస్తున్నారు.

అందరూ హాజరవడం డౌటే!

బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. త్వరలో మరికొంత మంది హస్తం పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విదేశీ పర్యటనకు హాజరవుతారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వెళ్లినా వారిలో ఎంత మంది బీఆర్ఎస్‌లో కొనసాగుతారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలకు ఫారిన్ టూర్ ఆహ్వానం అందినట్టు సమాచారం. ఈ టూర్ ఖర్చు మొత్తాన్ని ఓ మాజీ మంత్రి భరిస్తున్నట్టు టాక్. ఫ్లయిట్ చార్జీలు, హోటల్స్‌లో రూమ్ బుకింగ్‌ను సదరు మాజీ మంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు టాక్

Advertisement

Next Story