Bhatti Vikramarka: ఈటల రాజేందర్ మెమోరాండంపై భట్టి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
Bhatti Vikramarka: ఈటల రాజేందర్ మెమోరాండంపై భట్టి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు, అంశాలను 16వ ఆర్థిక కమిషన్ ముందు స్పష్టంగా ఉంచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను భట్టి మీడియాకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై సీఎస్ ప్రజెంటేషన్ ఇచ్చారని, రాష్ట్రాల అవసరాలను కేంద్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. కేంద్ర పథకాలు అన్ని రాష్ట్రాలకు ఓకే విధంగా ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఈ మూస విధానం ఉండకూడదని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతినెలా వడ్డీలకే భారీగా చెల్లిస్తున్నామని, రాష్ట్ర ఆదాయమంతా అప్పులు చెల్లించేందుకే సరిపోతోందని చెప్పామన్నారు. అందుకే గత అప్పులను రీస్ట్రక్చరింగ్ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. పర్‌క్యాపిటా ఆధారంగా నిధులు పంపిణీ చేయడం వల్ల తెలంగాణ భారీగా నష్టపోతున్నదన్నారు. అందువల్ల డీఎస్డీపీ ఆధారంగా నిధులు ఇవ్వాలని కోరినట్లు భట్టి తెలిపారు.

సంక్షేమానికి నిధుల కొరత..

తెలంగాణలో జిల్లాల మధ్య వ్యక్తుల ఆదాయాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఒకటి రెండు జిల్లాల్లో ప్రజల ఆదాయం, తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. మరికొన్ని జిల్లాల్లో ప్రజలకు ఉపాధి, ఆదాయం చాలా తక్కువగా ఉందని, అన్ని జిల్లాలను కలిపి తలసరి ఆదాయం లెక్కిస్తే తెలంగాణ స్థితి మెరుగ్గా చూపిస్తోందన్నారు. అందువల్ల ఈ వ్యత్యాసాన్ని పూరించేందుకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని, కేంద్రం విధానాల వల్ల సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడిందని కమిషన్‌కు వివరించామన్నారు. తెలంగాణ అర్బనైజేషన్ వేగంగా పెరుగుతున్నదని.. స్కిల్ యూనివర్సిటీ, ఆర్ఆర్ఆర్, ఫోర్త్ సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఇందులో సహాయ సహకారాలు కావాలని కోరామన్నారు. ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను ఇవ్వాలని భావిస్తున్నామని, వాటికి నిధులు కోరామన్నారు. వరదల నష్టంపైనా కేంద్రం నుంచి సహాయం కోసం ప్రతిపాదించాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌పై ఆర్థిక సంఘం సంతృప్తి వ్యక్తం చేసిందని భట్టి తెలిపారు.

అది బీజేపీ ఆలోచన కావొచ్చు..

కేంద్ర ప్రభుత్వ నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇష్టారీతిగా డైవర్ట్ చేస్తున్నదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైనాన్స్ కమిషన్‌కు చేసిన రిప్రజెంటేషన్‌పై భట్టి స్పందించారు. ఇది ఈటల ఆలోచన లేదా బీజేపీ ఆలోచన అయి ఉండవచ్చని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను ఎలా వాడుకున్నాయో ఈటలకే బాగా తెలుసన్నారు. ఆయనే గతంలో అదే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారన్నారు. తాము వచ్చాక కేంద్ర పథకాలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed