Bhatti Vikramarka: డెలివరీ సేవల పన్ను రేటు పై కమిటీ ఏర్పాటు చేయాలి.. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Maddikunta Saikiran |
Bhatti Vikramarka: డెలివరీ సేవల పన్ను రేటు పై కమిటీ ఏర్పాటు చేయాలి.. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొని పలు ప్రతిపాదనలు చేయగా జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఐజీఎస్టీ పునరుద్ధరణపై న్యాయబద్ధమైన విధానం అనుసరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వ్యాట్ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని కోరారు. డెలివరీ సేవల పన్ను రేటుపై చర్చ లో భాగంగా రెస్టారెంట్, ఇతర డెలివరీ సేవలను ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ల ద్వారా అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ అంశం సాంకేతికంగా క్లిష్టమైనందున, పన్ను అమలులో న్యాయం జరిగేందుకు సమగ్రంగా పరిశీలించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ రంగాల వారీగా 2019లో ఏర్పాటైన జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను కొనసాగించాలన్నారు. అధిక ఐజీఎస్టీ కేటాయింపుల పునరుద్ధరణ విషయంలో న్యాయబద్ధమైన విధానం అనుసరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. బిజినెస్ టు బిజినెస్ లావాదేవీలపై 1 శాతం సెస్ వేయాలని ఆంధ్రప్రదేశ్ కోరగా, వరదల వలన జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని అదే తరహా సౌకర్యాన్ని తెలంగాణకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ ఎం రిజ్వి, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు.

Advertisement

Next Story