Bhadradri: ఉత్తర ద్వారంలో రామయ్య.. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగిన భద్రాద్రి

by Ramesh Goud |   ( Updated:2025-01-10 04:00:57.0  )
Bhadradri: ఉత్తర ద్వారంలో రామయ్య.. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగిన భద్రాద్రి
X

దిశ భద్రాచలం : తెల్లవారుజామున.. భక్తుల జయజయధ్వానాలు.. మంగళ వాయిద్యాలు.. వేదమంత్రాల నడుమ భద్రాద్రి రామయ్య గరుఢవాహన రూడుడై, గజవాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి తెల్లని మేఘాలవలే అలుముకున్న ధూప మంజరలు.. మధ్య నుండి భక్తులకు దర్శనమివ్వండంతో.. ఆయొక్క స్వామి వారి దర్శనం సాక్షాత్ వైకుంఠాన్ని తలపించింది. భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 31వ తేది నుండి జరుగుతున్న శ్రీవైకుంఠ ఏకాదశి అద్యయనోత్సవాలలో భాగంగా శుక్రవారం సర్వఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన ఉత్తరద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. అర్థరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా భక్తరామదాసు పేరిట శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం జరిగింది. ఈ సేవను రెవిన్యూ శాఖాధికారులు నిర్వహించారు.

భక్తరామదాసు తహాసీల్దార్ ఉద్యోగం చేయడం వల్ల అయన రెవిన్యూ శాఖకు చెందిన వారుగా భావించి వారి సేవను నిర్వహంచడం భద్రాచలం రామాలయంలో అనాదిగా వస్తున్న ఆచారం., అభిషేకం అయిన తర్వాత లఘు అరాధన జరిగి మళ్ళీ విశేషంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత ధనుర్మాసానుసారంగా తిరుప్పావై సేవా కాలం, శాత్తుమొర అయిన తర్వాత భద్రాద్రి రాముడు ధనుర్బాణాలను అలంకారాలుగా ధరించి, రాజఠీవితో గరుడ వాహనాలంకృతుడవగా...ప్రత్యేకంగా అలంకరించబడిన ఉత్తరద్వారం లోపల సీతారామ లక్ష్మణ స్వాములను అర్చకులు వేంచేపుజేశారు.ఉత్తర ద్వారం బయట అశేష భక్త జనవాహిని ఉత్తరద్వార దర్శనంకై తహతహాలాడుతుండగా, వారిని వీనులవింధు కల్గించే విధంగా భక్త రంజని కార్యక్రమం భక్తరామదాసు కీర్తనలతో సాగింది. దాని తర్వాత ఆస్థాన పండితులు ఆ ప్రశాంత పవిత్ర వాతావరణంలో వైకుంఠ ఏకాదశి వైభవాన్ని గురించి హృదయ గమంగా ఉపన్యసించారు. సరిగ్గా తెల్లవారు జామున 5గంటలకు మంగళవాయిద్యములు మ్రోగుతుండగా, వేదఘోష సాగుతుండగా, ఘణ ఘణ గంటల ధ్వనుల మద్య ఉత్తర ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. శ్రీస్వామి వారు సీతాలక్ష్మణ సమేతులై భక్తులకు సాక్షాత్కరించారు.

ఈ దృశ్యం అనిర్వచనీయం, ఆ సన్నివేశం ఆపాత రమణీయం, అనుభవైక వేద్యం.శ్రీస్వామి వారికి ఆరాధన జరిపిన అనంతరం చతుర్వేద విన్నపాలు, శ్రీరామ షడక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, శరణాగతి గద్య విన్నపములతో పాటు తిరుప్పల్లాడు పాడుతుండగా, 108 వత్తుల హరతులతో స్వామి వారికి మంగళాశాసనంతో ఉత్తరద్వార దర్శన సేవ సుసంపన్నం అయింది.ఈ వైభవం భద్రాద్రిలో తప్ప మరెక్కడా ఉండదనడం అతిశయోక్తికాదు. సరిగ్గా 6 గం॥లకు ఆస్థాన హరిదాసులు కోదండపాణి అడుగో... అంటూ గానం చేస్తుండగా సపరివారంగా భద్రాద్రి రాముడు తిరువీధికి బయలుదేరాడు. శ్రీస్వామి వారికి భక్తులు మంగళనీరాజనాలు పలికారు, ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తుల శ్రీరామ.. జయరామ.. జైజై రామా.. జై శ్రీరామ్ ద్వానాల నడుమ అత్యంత వైభవంగా సాగింది. శుక్రవారం నుండి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమైనాయి.ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రెవిన్యూ శాఖ మంత్రి సతీమణి మాధురి రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,భద్రాచలం, పినపాక, ఇల్లందు శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్ పి రోహిత్ రాజు, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్, రామాలయం ఈ ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కాగా వైకుంఠ ద్వారంలో రామయ్యాను దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల శ్రీరామ నామ స్మరణతో భద్రాద్రి మారు మ్రోగింది.

Advertisement

Next Story

Most Viewed