ప్రత్యేక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. మంత్రి పొన్నం కు వినతి

by Mahesh |
ప్రత్యేక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. మంత్రి పొన్నం కు వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలలో పారిశ్రామికవేత్తలు చాలా తక్కువ అని, అందుకే వారి కోసం ప్రత్యేక బీసీ కార్పొరేషన్ అవసరమని ‘బ్యాక్వార్డ్ క్లాసెస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(బిక్కి) సెక్రటరీ దాసరి కిరణ్ డిమాండ్ చేశారు. బీసీల్లోని యువ, మహిళా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాభివృద్ధి, కొత్త పరిశ్రమల స్థాపన కోసం కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి కిరణ్ మాట్లాడుతూ.. బీసీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సమస్యలు, పరిష్కార మార్గాలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపై చర్చించినట్లు చెప్పారు. బీసీ పాలసీని తీసుకురావాలని మంత్రిని కోరినట్లు వివరించారు. యువ, మహిళా బీసీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక బీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, దానికి ప్రత్యేక నిధిని కేటాయించాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడమే కాకుండా ఎంబీసీ కులాల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలన్నారు.

ప్రతి రంగంలో బీసీల వాటాను నిర్దేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసే వివిధ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన టెండర్లలో బీసీలకు ప్రత్యేక వాటా అంటే 30 శాతం కేటాయించాలన్నారు. ఆయా టెండర్లలో ఎవరూ పాల్గొనకపోతే, మూడుసార్లు ప్రకటించిన అనంతరం సామాన్యులకు అవకాశమివ్వాలని పేర్కొన్నారు. బీసీల్లో పారిశ్రామికవేత్తలు తక్కువగా ఉన్న దృష్ట్యా, అంకుర పరిశ్రమలకు అవకాశాలు కలిగేలా పారిశ్రామిక అనుభవం, ఈఎండీ మినహాయింపులు కల్పించాలని కోరినట్లు వివరించారు. కుల వృత్తులకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తి గాని, సేవకు సంబంధించిన టెండర్లలో బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చేలా చూడాలన్నారు. దీనికోసం ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేయాలని వివరించారు. కంపెనీ స్థాపన లో అవసరమయ్యే భూ విక్రయం, లీజ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులో పూర్తి మినహాయింపు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు. కాగా దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కిరణ్ చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో బిక్కి రాష్ట్ర సమన్వయకర్త పరికిపండ్ల సుమంత్ ఉన్నారు.

Advertisement

Next Story