మరింత అట్టహాసంగా ఈసారి దసరా, బతుకమ్మ వేడుకలు

by GSrikanth |
మరింత అట్టహాసంగా ఈసారి దసరా, బతుకమ్మ వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: చార్లెట్ తెలంగాణ సంఘం ఆధ్వరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతిసారికి భిన్నంగా ఈసారి రెండు కార్యక్రమాలను నిర్వహించారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకను సెప్టెంబరు 25వ తేదీన ఉత్తర చార్లెట్‌లో ఉన్న జేఎం రాబిన్సన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. సద్దుల బతుకమ్మ & దసరా వేడుకలను 8వ తేదీన దక్షిణ చార్లెట్లో‌లోని కమ్యూనిటీ హౌస్ మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాల్లో తెలంగాణా సంఘం కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని పాఠశాలను సుందరంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం నుండే వివిధ ప్రాంతాల నుండి రంగు రంగుల పూలతో పేర్చి అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో మహిళలు పిల్లలతో సహా వందల కుటుంబాలు తరలివచ్చారు. నోరూరించే తినుబండారాల దుకాణాలు ఒకపక్క, జిగెల్లుమనే ఆభరణాలు, వస్త్ర దుకాణాలు మరోపక్క కార్యక్రమానికి వచ్చినవారిని ఆకర్షించాయి. రెండు గంటలకు ప్రారంభమైన సాంస్కతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలతో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశారు.

అనంతరం మహిళల కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మలను తొడ్కొనివచ్చి, బతుకమ్మల చుట్టూ చప్పట్లతో బతుకమ్మ పాటలు పాడుతూ గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. కార్యక్రమం జరిగినంతసేపు బంధుమిత్రల పలుకరింపులతో, వారితో కలిసి ప్రాంగణంలో చేసిన అలంకరణల వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆ తరువాత బతుకమ్మలను ఊరేగింపుగా ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కొలనులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జానపద గాయకుడు జనార్దన్ పన్నెల పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చార్లెట్ తెలంగాణ సంఘం వరుసగా పదమూడో సంవత్సరం ఈ వేడుకలు జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా చార్లెట్ తెలంగాణ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed