- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకమాండ్ ఆదేశాలతో 'బండి' అలర్ట్.. ఏకకాలంలో మూడు వ్యూహాల అమలు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడంపై కసరత్తులను ముమ్మరం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ స్పీడ్ సరిపోదన్న హైకమాండ్ ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం అలర్ట్ అయింది. తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టడంపై జాతీయ నాయకత్వం పలు గైడ్ లైన్స్ పంపించింది. దానికి అనుగుణంగా పార్టీ యాక్టివిటీ సాగుతోంది. అందులో భాగంగా నాయకులు, కార్యకర్తల సహకారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు ఏకకాలంలో మూడు టాస్క్‌లు చేపడుతున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు చేయడంపై దృష్టిసారిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి చేరవవుతున్నారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వంపై తన మాటలతో యుద్ధాన్ని ప్రకటించారు. ఏకకాలంలో మల్టీటాస్కింగ్ చేస్తూ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. జాతీయ నాయకత్వం ఆదేశించిన ప్రకారం ఎన్నికల నాటికి ఈ ఉధృతిని మరింత పెంచడంపై కసరత్తు చేస్తున్నారు.
సామన్యుల కష్టాలు తెలుసుకోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను రాష్ట్రానికి తెలియజేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకులు, కార్యకర్తల సహకారంలో ఐదు విడుతల ప్రజా సంగ్రామ యాత్రను పూర్తిచేశారు. ఒకప్పుడు పట్టణానికే పరిమితమైన బీజేపీని గ్రామీణ ప్రాంతానికి చేరువ చేయడంలో ఈ యాత్ర ఎంతో ఉపయోగపడింది. ఈ యాత్రతో పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఈ యాత్రకు ఏకంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ప్రశంసలు లభించాయి. పాదయాత్ర ద్వారా పెరిగిన పార్టీ గ్రాఫ్‌ను పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌లో ఎంపీలకు వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేంత స్థాయికి చేరువైంది. ఒక మోడల్‌గా నిలిచింది. పార్టీ గ్రాఫ్ పెరిగిన తీరు నేపథ్యంలోనే జాతీయ నాయకత్వం దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను ఎంచుకుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి ప్రతినెలా ఒకసారి తెలంగాణలో పర్యటిస్తానని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ సహా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తెలంగాణలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అగ్ర త్రయంగా పిలుచుకునే ఈ ముగ్గురిలో ప్రతి నెలా ఎవరో ఒకరు తెలంగాణలో పర్యటించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి హైకమాండ్ తెలంగాణ విషయంలో ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో బీజేపీ పరిస్థితిని ఓవరాల్‌గా చూసుకుంటే బిఫోర్ 'బీఎస్‌కే'.. ఆఫ్టర్ 'బీఎస్‌కే'గా చెప్పుకోవచ్చు. ఏమాత్రం లేని పార్టీ ఇమేజ్‌ను నాయకులు, కార్యకర్తల కృషితో ఇంత వరకు తీసుకొచ్చారు. పాదయాత్రలతో ప్రజా సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు, పార్టీని ప్రతి గల్లీకి చేర్చడంపై ఫోకస్ పెట్టింది. అందుకే తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే ఇదే అనువైన సమయమని భావించిన జాతీయ నాయకత్వం ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యూహాన్ని ఇక్కడ వ్యూహాత్మకంగా అమలుచేస్తోంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 11 వేల వీధి సభలను నిర్వహిస్తోంది. దీనివల్ల స్థానికంగా పార్టీ బలమేంటనే విషయంపై స్పష్టత రానుంది. దానికి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశంపై జాతీయ నాయకత్వం ఒక అంచనాకు రానుంది. ఉన్న కేడర్‌తో పాటు కొత్త కేడర్ పుట్టుకురానుంది.
దీంతో అటు పార్టీని బూత్ స్థాయికి చేరవ చేయడంతో పాటు కమిటీల ఏర్పాటు కూడా పార్టీకి సులువుకానుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగులతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనేలా బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంది. వీధి సభలను 15 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న బీజేపీ.. రోజుకు సగటున 730 సభలు చేపట్టాలని హైకమాండ్ ఆదేశించింది. శక్తికేంద్రాల వారీగా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు పంజా వేయాలని చూస్తోంది. యూపీలో ఇదే తరహా ఫార్ములాతో గ్రౌండ్ లెవల్‌కు చేరువై రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. తెలంగాణలోనూ వీధి సభలతో పార్టీకి వచ్చే ఆదరణతో బీఆర్ఎస్‌కు చెక్ పెట్టి అధికారంలో చేజిక్కించుకునే యోచనలో కాషాయ పార్టీ ఉంది. వీటితో పాటు పార్టీ పటిష్టతకు శిక్షణలు, చేరికలపైనా బీజేపీ దృష్టిసారిస్తోంది.
అధికార పార్టీకి చెక్ పెట్టాలని డిసైడైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగుతోంది. మాటల యుద్ధాన్ని మొదలెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు తమ మాటల్లో పదును పెంచారు. కేసీఆర్‌కు దీటుగా జవాబు చెప్పాలంటే మాటలనే తూటాలుగా, అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వాగ్ధాటిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అధికార బీఆర్ఎస్‌తో పాటు మజ్లిస్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ టెంపోను ఇలాగే కొనసాగించాలని కమలదళం డిసైడ్ అయింది. రానురాను భవిష్యత్‌లో ఈ ఉధృతిని మరింత పెంచడమే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తన మాటలతో ప్రజలను మెప్పించి ఓటు బ్యాంకును పెంచుకోవాలని కమలదళం సరికొత్త ఎత్తుగడలను వేస్తోంది. బీఆర్ఎస్‌కు బ్రేకులు వేసి అధికారంలోకి రావాలని ప్రణాళికలు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయం డూమ్ కూల్చేస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సంచలనంగా మారాయి.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ బండి సంజయ్ ఇదే తరహా దూకుడును ప్రదర్శించారు. పలు ఆసక్తికర, పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, మజ్లిస్ రెండూ ఒకటేనని పలుమార్లు విమర్శలు చేసిన బండి శివమొస్తే.. మాకు.. శవాలొస్తే మీకు అనే సంచలన వ్యాఖ్యలతో అధికార పార్టీపై, ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. పాతబస్తీలో రోహింగ్యాలను ఏరివేయడానికి సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల కూడా సర్జికల్ స్ట్రైక్ ప్రస్తావను ఆయన తీసుకొచ్చారు. పలు ప్రాంతాల పేర్లను కూడా మారుస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఆ వ్యాఖ్యల ప్రభావం ఎంత వరకు ఉందో తెలియదు కానీ జీహెచ్ఎంసీలో మాత్రం బీజేపీ ఏకంగా 48 సీట్లను కైవసం చేసుకుంది. దీన్ని బట్టి బండి సంజయ్ మళ్లీ అదే సీన్‌ను రిపీట్ చేస్తున్నారా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే వారూ లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ కమలదళపతి చేపడుతున్న భావోద్వేగ ప్రసంగాల వ్యూహాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయనేది వేచి చూడాల్సిందే. బీజేపీ శ్రేణుల వ్యాఖ్యలు పార్టీ కేడర్‌లో జోష్ నింపి అధికారంలోకి వచ్చేందుకు ఎంతమేరకు ఉపయోగపడుతాయనేది తెలియాల్సి ఉంది.