రాష్ట్రంలో మళ్లీ మహా కుట్ర జరుగుతోంది.. తస్మాత్ జాగ్రత్త: బండి సంజయ్

by GSrikanth |
రాష్ట్రంలో మళ్లీ మహా కుట్ర జరుగుతోంది.. తస్మాత్ జాగ్రత్త: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈసారి మోసపోతే గోసపడటం ఖాయమని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే మహా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో బిడ్డ, పేపర్ లీకేజీలో కొడుకు అవినీతి స్కాంల నుంచి దారి మళ్లించే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ విడుదల చేశారని ఆయన మండిపడ్డారు. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ సోమవారం కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాయడం వెనుక పెద్ద కకుట్ర దాగి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ ప్రజలతోపాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి నిదర్శనంగా ఇది నిలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఏనాడైనా ప్రజలను, కార్యకర్తలను ప్రగతి భవన్ లోపలికైనా రానిచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నడైనా పిలిచి బువ్వ పెట్టాడా అని ప్రజలు ఆలోచించాలని సూచించారు.

అటుకుల పేరుతో వేల కోట్లు దోచుకున్నాడని బండి ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనను బొందపెట్టాలని యావత్ తెలంగాణ ప్రజలకు బండి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సర్కార్ పోయి బీజేపీ అధికారంలోకి వచ్చాక అమరుల ఆశయాలు, ఉద్యమకారుల ఆకాంక్షల నెరవేర్చుకుందామని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని, నిరుద్యోగులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్‌కొస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌజ్‌కే పరిమితమై పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.

ఇప్పటికే కాళేశ్వరం స్కాం, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలకు కారణమైన ఐటీ స్కాం, ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అనేక కుంభకోణాల వెనుక కేటీఆర్ కుటుంబ సభ్యుల హస్తమే ఉందని తెలంగాణ సమాజానికి అవగతమైందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా ఉండేందుకు ముందుగానే వారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్.. తన అధికారాన్ని కాపాడుకునేందుకు తెలంగాణను అవమానించిన వాళ్లను, అవినీతిపరులను చేరదీసి అందలమెక్కించిన విషయాన్ని మర్చిపోగలమా? అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ ప్రజలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆలోచించాలని ఆయన సూచించారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఈ నక్కజిత్తుల కేసీఆర్ మాటలను నమ్మితే నట్టేట మునిగిపోతామని సూచించారు. తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను బొందపెట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ చేపడుతున్న పోరాటాలకు మద్దతు పలకాలని విజ్ఞప్తిచేశారు.

Advertisement

Next Story

Most Viewed