సీఎం రేవంత్‌‌ను బీజేపీలో చేర్చుకుంటాం.. బండి సంజయ్ ఓపెన్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |
సీఎం రేవంత్‌‌ను బీజేపీలో చేర్చుకుంటాం.. బండి సంజయ్ ఓపెన్ స్టేట్‌మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోడీ సిద్ధాంతాలపై విశ్వాసాన్ని ప్రకటించి ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చినా అభ్యంతరం చెప్పకుండా జాయిన్ చేసుకుంటామని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫున లాయర్‌గా ఉన్న అభిషేక్ మను సింఘ్వికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, కేసీఆర్ ఆదేశాలతోనే ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని అనడానిక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని బండి సంజయ్ ప్రశ్నించారు. సభ్యత్వ నమోదులో భాగంగా సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలూ దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. త్వరలోనే ఈ రెండు పార్టీల మధ్య విలీన ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నదని కామెంట్ చేశారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటివరకు అభ్యర్థిని బీఆర్ఎస్ ఖరారు చేయలేదని, ఆ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అవకాశాన్ని వదులుకుంటున్నదని బండి సంజయ్ అన్నారు. బీజేపీకి అంతటి సంఖ్యాబలమే ఉన్నట్లయితే అభ్యర్థిని నిలబెట్టేదని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ సైలెంట్‌గా ఉన్నదని ప్రశ్నించారు. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మధ్యనే ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్ళి కేసీఆర్‌ని కలిశారని, ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందన్నారు. కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ చేస్తున్నదని, ఈ రెండు పార్టీల మధ్య విలీనం కోసం ఢిల్లీ స్థాయిలో రహస్య ఒప్పందం జరగడమే ఇందుకు కారణమన్నారు. రుణమాఫీ ఫలాలు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే విగ్రహాల రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు.

కొన్ని విగ్రహాలను కూలగొట్టాలి అనుకుంటే కూల్చండి అని కామెంట్ చేసిన బండి సంజయ్... అధికారంలో ఉన్న పార్టీలు వాటికి అనుకూల విగ్రహాలను పెట్టుకుంటాయన్నారు. వాజ్‌పేయి విగ్రహాన్ని పెట్టాలని తాము కోరుకుంటున్నామని, రాజీవ్‌గాంధీ, కేసీఆర్ విగ్రహాలతో పాటు దీనిపైన కూడా చర్చ జరపాలన్నారు. ‘హైడ్రా’లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి నడుస్తోందని, చిన్నచిన్న స్థలాలు ఉన్నవారి దగ్గరికి వెళ్ళడం తప్ప ఐదెకరాలకు పైబడినవారి దగ్గరికి హైడ్రా వెళ్ళడం లేదున్నారు. కేటీఆర్ సంసారిలా మాట్లాడుతున్నారుగానీ... జన్వాడలోని ఫామ్ హౌజ్ ఆయనకు చెందినది కాబట్టే ఆనాడు డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టారని ఆరోపించారు. అప్పుడు లేని లీజు సంగతి ఇప్పుడు తెరపైకి వచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed