‘అంబేద్కర్ విగ్రహాన్ని దళిత ద్రోహి ప్రారంభించడం బాధగా ఉంది’

by GSrikanth |   ( Updated:2023-04-14 16:34:35.0  )
‘అంబేద్కర్ విగ్రహాన్ని దళిత ద్రోహి ప్రారంభించడం బాధగా ఉంది’
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ మహాశయా.. మన్నించు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అంబేద్కర్ వంటి చారిత్రక పురుషుని విగ్రహాన్ని దళిత ద్రోహి ప్రారంభించడం బాధగా ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మీరు రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ మిమ్ముల్ని అడుగడుగునా అవమానించినోళ్లే ఓట్ల కోసం మీ జపం చేస్తున్నారని తెలిపారు. గత 8 ఏళ్లలో ఏనాడూ మీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానోళ్లు మీ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తున్నోళ్లే మీ సిద్ధాంతం గొప్పదని బాకాలు కొడుతున్నారన్నారు. దళితులను దారుణంగా మోసం చేసిన వాళ్లు, దళిత సీఎం, దళితులకు మూడెకరాల హామీని తుంగలో తొక్కినోళ్లే ఓట్ల కోసం దళిత జపం చేస్తున్నారని వివరించారు. నిరుపేద దళిత కుటుంబాలను గాలికొదిలేసి అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ జీవితాలనే సర్వస్వం ధారపోసిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అందరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అని, అలాంటి విగ్రహం వద్దే ఓట్ల రాజకీయ క్రీడను మొదలు పెట్టడం బాధగా ఉందన్నారు. దళితుల కన్నీటి వర్షాన్ని అంబేద్కర్ తుడిస్తే దళితులను అంధకారంలోకి నెట్టినోడు కేసీఆర్ అని విమర్శించారు. మహిళల సమున్నత అభివృద్ధిని కోరుకున్న మహా వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక తొలి మంత్రివర్గంలో చోటు ఇవ్వని అహంకారి కేసీఆర్ అని పేర్కొన్నారు. బోధించు.. సమీకరించు.. పోరాడు నినాదంతో అంబేద్కర్ ముందుకేళ్తే.. ప్రజలను విశ్వసించను.. ప్రజలను కలవను.. ప్రజల పోరాటాలను సహించననే నినాదంతో పాలన చేస్తూ తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తానంటే నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారం వస్తుందని కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నారని వెల్లడించారు. ‘‘అంబేద్కర్ మహాశయా.. మాట ఇస్తున్నా. 2024 దాకా ఎందుకు? 2023లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం’’ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడతామని బీజేపీ పక్షాన అంబేద్కర్‌కు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed