Bandi Sanjay: మహిళల భద్రతే మనకు ముఖ్యం.. జైనూర్ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి

by Ramesh Goud |   ( Updated:2024-09-04 14:58:59.0  )
Bandi Sanjay: మహిళల భద్రతే మనకు ముఖ్యం.. జైనూర్ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసిఫాబాద్ జిల్లాలో లైంగిక దాడి ఘర్షణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. జైనూర్‌లో శాంతిభద్రతలను సత్వరమే పునరుద్దరించాలని తెలంగాణ డీజీపిని ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ గ్రామంలో గిరిజన మహిళపై సంఘ వ్యతిరేకులు దారుణంగా దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగిందని తెలిపారు. బాధిత కుటుంబంతో మాట్లాడటం జరిగిందని, వారిని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనపై తెలంగాణ డీజీపిని సంప్రదించామని, దాడికి బాధ్యులైన నేరస్థులపై త్వరితగతిన, నిష్పాక్షికమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

అంతేగాక జైనూర్‌లో శాంతిభద్రతలను సత్వరమే, సమర్థవంతంగా పునరుద్ధరించాలని ఆయనకు తెలియజేశామని అన్నారు. ఇక మన మహిళల భద్రత, మన సమాజంలో శాంతి అత్యంత ముఖ్యమైనవని కేంద్ర మంత్రి ఎక్స్‌లో రాసుకొచ్చారు. కాగా ఆదివారం జైనూర్ బస్టాండ్ వద్ద ఉన్న ఓ ఆదివాసీ మహిళను మగ్దూం అనే ఆటోడ్రైవర్ కోహినూరులో దించుతానని చెప్పి తీసుకెళ్లి, మార్గమధ్యంలో ఆ మహిళపై అత్యచారానికి పాల్పడమే గాక హత్యయత్నానికి ఒడిగట్టాడు. దీంతో అత్యాచారం చేసిన నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు జైనూర్ లో నిరసన చేశారు. ఇందులో మగ్దూంకు చెందిన వర్గానికి, ఆదివాసీలకు మధ్య సంఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పలు దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

Advertisement

Next Story