Bandi Sanjay: ధనుష్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత..

by GSrikanth |   ( Updated:2023-06-24 11:44:26.0  )
Bandi Sanjay: ధనుష్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల్లో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో ఇవాళ విద్యాదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. వాటి నుండి తప్పించుకునేందుకు పరుగెత్తిన ధనుష్ ట్రాక్టర్ కింద పడి మరణించాడు. ఈ ఘటనపై స్పందించిన బండి సంజయ్.. ఇది దిగ్భ్రాంతికరం అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన.. స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్ధిని దశాబ్ది ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలన్నారు.

తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేలా యంత్రాంగంపైనే కాకుండా విద్యార్థులను సైతం ఈ ప్రభుత్వం బలవంత పెట్టడం దారుణం అన్నారు. గతంలో ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలిని రోజంతా ఎదురుచూసేలా చేసి ఆమె మృతికి కారణం అయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పుడు దశాబ్ధి ఉత్సవాల్లో ధనుష్ దుర్మరణం పాలయ్యాడని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా బండి సంజయ్ నిలదీశారు.

Also Read.

బిగ్ న్యూస్: సీఎం KCR షాకింగ్ డెసిషన్.. ఆ 12 మంది సిట్టింగ్‌లకు టికెట్ కట్..?

Advertisement

Next Story