Bandi Sanjay: కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి నాడు మౌనం.. గులాబీ బాస్ పై బండి సంజయ్ ఫైర్

by Prasad Jukanti |
Bandi Sanjay: కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి నాడు మౌనం.. గులాబీ బాస్ పై బండి సంజయ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీచర్లు తలుచుకుంటే తలరాతలే కాదు ప్రభుత్వాలే కూలిపోతాయని, గతంలో వారితో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేకపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు నెల మొదటి వారంలోనే జీతాలు పడుతున్నాయంటే అది బీజేపీ చేసిన పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. ఇవాళ కరీంనగర్‌లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవో పేరుతో టీచర్లను చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తే, మీ కోసం పోరాడి తాను జైలుకు వెళ్లానని గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీ కుటుంబాలను ఏ విధంగా మానసిక వేధనకు గురి చేశారో తామింకా మరువలేదన్నారు. పార్టీ కార్యకర్తలంతా టీచర్ల కోసం పెద్ద యుద్ధమే చేశారన్నారు. కేసులు, లాఠీలకు భయపడకుండా పోరాడారు. అయినా ఆనాడు ఏ ఉపాధ్యాయ సంఘం తమకు మద్దతివ్వలేదని, ఒక్క తపస్ మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడి, అత్యధిక కేసులున్న ఎంపీని తానేనని, తనపై 109 కేసులు ఉన్నాయని బండి వెల్లడించారు.

కేసీఆర్ అరాచకంతో సంఘాల మౌన పాత్ర..

కేసీఆర్ అరాచక పాలనకు భయపడి గతంలో ఉపాధ్యాయ సంఘాలు సైతం మౌన పాత్ర పోషించాయని, ఇంది చాలా బాధాకరమని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికీ పీఆర్సీ రాలేదు. రిటైర్డ్ అయితే పెన్షన్ పైసలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆనాడు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే డీఏలు, ప్రమోషన్లు ఆగేవి కావని, కేంద్రం పెండింగ్ డీఏలు ఇచ్చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మీ కోసం కొట్లాడే పార్టీలను మీరే నిర్లక్ష్యం చేస్తే టీచర్లపై విశ్వాసం పోతుందన్నారు. అందువల్ల మీ హక్కుల కోసం పోరాడే నాయకుడిని ఎన్నుకునే అవకాశం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక రూపంలో రాబోతోందన్నారు. రాబోయే టీచర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి జోడిని గెలిపించాలని కోరారు.

మళ్లీ కుట్ర జరుగుతోంది..

బీఈడీ అర్హతలు ఉండి ఎస్జీటీలుగా పని చేస్తున్న టీచర్లకు ప్రమోషన్ల విషయం తన దృష్టికి వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. డీఈడీ అర్హతలున్న వారికే ప్రమోషన్లు రావడంతో సీనియర్లైన బీఈడీ టీచర్లు తీవ్ర వివక్షకు గురవతున్నారు. ఈ విషయాన్ని కేంద్రంలోని హెచ్ఆర్‌డీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) గైడ్ లైన్స్‌లో మార్పులు చేయించే ప్రయత్నం చేస్తానన్నారు. పాఠ్యాంశాల్లో మళ్లీ నక్సలైట్ సిద్ధాంతాలను, కమ్యూనిస్టు మూలాలను జొప్పించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. విద్యా వ్యవస్థకు చిన్నాభిన్నం చేసే వ్యక్తులు చొరబడుతున్నారని, ఎదురు నిలవాల్సిన అవసరం ఉందని బండి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed