ఏ ఒక్క రోజు CM రేవంత్ ‘జై తెలంగాణ’ అనలే: బాల్క సుమన్ సీరియస్

by Satheesh |   ( Updated:2024-06-12 10:45:16.0  )
ఏ ఒక్క రోజు CM రేవంత్ ‘జై తెలంగాణ’ అనలే: బాల్క సుమన్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో బాల్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని తాజాగా చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంపై అనాడు బీఆర్ఎస్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. ఏడు మండలాల కోసం పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలుగా మేం కొట్లాడాం. కానీ ఆ ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లోనే నడుస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిత్యనాధ్ దాస్‌ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించిందని.. ఏపీలో పని చేసిన ఆదిత్యనాధ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పది సంవత్సరాల తర్వాత తెలంగాణపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని నిప్పులు చెరిగారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఒక్క నాడు జై తెలంగాణ అనలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.

భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న యటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేయాలన కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పైన కమీషన్లు వేస్తూ కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ అంటేనే కమీషన్ల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యల కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed