రొనాల్డ్ రోస్, ఆమ్రపాలిని మళ్లీ తెప్పించుకునేందుకు ప్రయత్నం

by Gantepaka Srikanth |
రొనాల్డ్ రోస్, ఆమ్రపాలిని మళ్లీ తెప్పించుకునేందుకు ప్రయత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌‌కు వెళ్లిన రోనాల్డ్ రోస్, ఆమ్రపాలిని తిరిగి తెప్పించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారిద్దరూ కీలక బాధ్యతల్లో ఉన్నందున వారిని వదులుకోరాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. డీవోపీటీ తీసుకున్న నిర్ణయాన్ని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో అనివార్యంగా వారు ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. వారిని తిరిగి తెలంగాణ కేడర్‌గా ఇక్కడ పనిచేయడానికి అవకాశం లేకపోవడంతో ఏకైక ప్రత్యామ్నాయంగా ఇంటర్ స్టేట్ కేడర్ డిప్యుటేషన్ పద్ధతిలో రప్పించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల సమ్మతితో డీవోపీటీ నిర్ణయం మేరకు ఈ ప్రక్రియ జరగాల్సి ఉన్నందున దానికి సంబంధించి సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. రెండు రాష్ట్రాల పెద్దలు, చీఫ్ సెక్రెటరీల స్థాయిలో పరస్పరం కమ్యూనికేషన్ ప్రాసెస్ జరిగిందని, ఇక డీవోపీటీకి వేర్వేరుగా లేఖలు రాసిన తర్వాత తొలి అడుగు పడుతుందనేది ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.

డీవోపీటీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని రివర్సల్ చేయడం సాధ్యం కానందున రెండు రాష్ట్రాల సమ్మతి, పరస్పర అంగీకారంతో ఆ ఇద్దరినీ తెలంగాణకు రప్పించుకోవడం వీలవుతుందనేది ఆ వర్గాల వాదన. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలు డీవోపీటీకి లేఖ రాసి అందులో పరస్పర అంగీకారం గురించి వివరించాల్సి ఉంటుందని తెలిపాయి. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా డీవోపీటీ అధికారులు ఈ అంశాన్ని ప్రధాని నేతృత్వంలోని సెంట్రల్ కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ (సీసీఏసీ) దృష్టికి తీసుకెళ్తారని, అక్కడ జరిగే నిర్ణయం ఆధారంగా డీవోపీటీ తదుపరి ఉత్తర్వులను జారీ చేస్తుందని పేర్కొన్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో రెండు రాష్ట్రాల మధ్య సమ్మతి కుదిరిందని, ఆ ఇద్దరు అధికారులను తెలంగాణకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీల నుంచి డీవోపీటీకి లేఖలు వెళ్తాయని, ఆ తర్వాతి ప్రాసెస్ కూడా మొదలయ్యే అవకాశముందన్నారు.

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆ ఇద్దరు అధికారులను ఏపీ కేడర్‌గా డీవోపీటీ గుర్తించినా తిరిగి ఆ రాష్ట్రానికి పంపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదనే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోడీకి వివరించనున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నందువల్ల తెలంగాణ రిక్వెస్టు మేరకు ఆయన చొరవ తీసుకుంటారనే హామీ లభించినట్లు తెలిసింది. ఆ ఇద్దరు అధికారుల సేవలను పరిపాలనలో వినియోగించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలో జరిగే సీసీఏసీ మీటింగులో దీన్ని ఎజెండాలో ఒక అంశంగా పెట్టుకుని క్లియరెన్సు ఇచ్చేలా నిర్ణయం జరుగుతుందని, దాని ఆధారంగా డీవోపీటీ కూడా వచ్చే నెలలో ఉత్తర్వులు జారీచేసే అవకాశముందన్నది సచివాలయ వర్గాల సమాచారం. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి ఐదుగురు ఐఏఎస్ అధికారులు వెళ్లినా ఆ ఇద్దరి కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed