యే క్యా హో రహా హై.. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై.. హరీశ్ రావు ఢిల్లీలో ఉండగానే జంప్

by Prasad Jukanti |
యే క్యా హో రహా హై.. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై.. హరీశ్ రావు ఢిల్లీలో ఉండగానే జంప్
X

దిశ, చేవెళ్ల/డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ సమక్షంలో కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు కారు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇంతకుముందు భద్రాచలం-తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్-దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్-ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల-ఎమ్మెల్యే డా.సంజయ్ హస్తం పార్టీలో చేరగా తాజాగా కాలె యాదయ్య సైతం వారి బాటలోనే వెళ్లారు.

హరీశ్‌రావు ఢిల్లీలో ఉన్నవేళే..

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ఢిల్లీలో ఉన్న సమయంలోనే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ అయ్యేందుకు హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో కాలె యాదయ్య ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మారారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో దుమారంగా మారుతోంది.

మళ్లీ సీఎం రేవంత్.. సీక్రెట్ స్ట్రాటజీ...

ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలంతా పార్టీ మారుతుంటే వారిని నిలువరించడంలో గులాబీ బాస్ విఫలం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వలసల నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఫామ్‌హౌస్ కేంద్రంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే దశలవారీగా ఎమ్మెల్యేలతో భేటీ అయి ఎవరూ తొందరపడవద్దని సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయినా కేసీఆర్ మాటలను ఖాతరు చేయని ఎమ్మెల్యేలు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. వలసల విషయంలో రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న సీక్రెట్ స్ట్రాటజీని కేసీఆర్ అంచనా వేయలేకపోతున్నారనే చర్చ తెరపైకి వస్తోంది. కాంగ్రెస్‌తో చాలామంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నా వారిని గుర్తించి నిలువరించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకెంత మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story