తెలంగాణ పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం.. TJS, కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన డీల్

by Satheesh |   ( Updated:2023-10-30 09:23:35.0  )
తెలంగాణ పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం.. TJS, కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన డీల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. కలిసి పనిచేయాలని రెండు పార్టీలూ నిర్ణయం తీసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించడమే ఉమ్మడి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో రెండు పార్టీలూ పరస్పరం సహకరించుకునేలా చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఓట్లు, సీట్ల సర్దుబాటుకు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనలో టీజేఎస్‌కు తగిన భాగస్వామ్యం కల్పిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ క్లారిటీ ఇవ్వగా, వాటికి అదనంగా ఆరు అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోదండరాం సూచించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేండ్ల పాలన నిరంకుశంగా, అప్రజాస్వామికంగా కొనసాగుతున్నదని, అనేక సెక్షన్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రజా పరిపాలన కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాని నిర్ణయించుకున్నామని కోదండరాం తెలిపారు. కొత్త ప్రభుత్వంలో పరిపాలనలో తగిన భాగస్వామ్యం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదిరిందన్నారు. విద్య, వైద్యాన్ని ప్రలకు ఉచితంగా అందించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రైతాంగానికి తగిన సహాయ సహకారాలు లభించాలని, పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యాన్ని ఇవ్వాలని, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం టీజేఎస్, కాంగ్రెస్ మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు కావాలని సూచించారు.

వీటికి సానుకూలంగా స్పందించిన రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతమొందించే గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి కోదండరాం సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. తమ రెండు పార్టీల మధ్య రాజకీ అవగాహన కుదిరిందని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు కోట్ల మంది ప్రజలను తెలంగాణ జేఏసీ వేదికగా కదిలించిన కోదండరాంకు కొత్త ప్రభుత్వంలో పరిపాలనాపరంగా సముచిత స్థానం, భాగస్వామ్యాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం కొట్లాడిన కోదండరాం విజ్ఞప్తికి అనుగుణంగా 40 లక్షల మంది యువత, నిరుద్యోగులు బీఆర్ఎస్ పాలనను గద్దె దించడానికి కదిలి రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story