ఎస్సారెస్పీ పునరావాసులకు ఇళ్ల పట్టాలిస్తాం

by Sridhar Babu |
ఎస్సారెస్పీ పునరావాసులకు ఇళ్ల పట్టాలిస్తాం
X

దిశ, భైంసా : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరావాస గ్రామస్తులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వం స్థలాలు ఇచ్చినప్పటికీ హక్కు పత్రాలు లేకపోవడంతో రుణాలు కావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాలేశ్వరం 28 ప్యాకేజీ పనులకు 320 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని, గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ సీసీ లైనింగ్ పనులకు 50 కోట్లు, గుండెగాం పునరావాసానికి నిధులు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

ఆయన ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారన్నారు. ఏరియా ఆసుపత్రి పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, అప్పట్లో 16 మంది డాక్టర్లు ఉంటే ప్రస్తుతం 32 మందిని నియమించినట్టు చెప్పారు. ఏరియా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు. బ్రహ్మన్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ద ప్రాతిపదికన చేపడతామన్నారు. కుబీర్ లో 132 /11 కేవీ సబ్ స్టేషన్, కోలూర్, మహాగాం, పల్సి గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న 190 చెరువులకు మరమ్మతులు చేయడానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కుంటాలలో 30 పడకల ఆసుపత్రి, బైంసా, కుబీర్ బాసర్, కుంటాల, ముధోల్ మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగిందన్నారు.

బాసరలో ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో బాసరకు 50 కోట్లు, అడెల్లి ఆలయ నిర్మాణానికి 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయితే అడెల్లి ఆలయాన్ని పునర్నిర్మించారని, బాసర నిధులు వెనక్కి పోయాయని చెప్పారు. 42 కోట్ల నిధులను ఇచ్చి బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. ముధోల్ లో అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు విషయమై అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు రాజేష్ బాబు, నాయకులు సొలంకి భీమ్ రావ్, వెంగల్ రావ్, మోహన్ రెడ్డి, సుమన్, ఆనంద్ రావ్ పటేల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed