శాంతియుత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి

by Sridhar Babu |
శాంతియుత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రజలు శాంతియుత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని జిల్లాలో మట్టి విగ్రహాల ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు జిల్లా ప్రజలు భక్తిశ్రద్దలతో పూజలు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సోషల్ మీడియాపై నిఘా పెంచాలని, అందులో వచ్చే అపోహలను నమ్మవద్దని అధికారులకు సూచించారు.

అదేవిధంగా 17వ తేదీన జరిగే మిలాద్ వున్ నబి వేడుకలు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరుపుకోవాలని తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు, మున్సిపల్ శాఖ శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గణేశ్​ మండపాల వద్ద రాత్రి పూట ఇద్దరు ఉండేలా చూడాలని, ఎక్సైజ్ శాఖ ద్వారా బెల్ట్ షాపులను మూసివేయాలని, విద్యుత్ శాఖ ద్వారా సీఎం ఆదేశాల మేరకు ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. 9440811700 కు కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ లో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీవో లు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed