ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఖతం..!

by Anjali |   ( Updated:2023-04-14 03:38:36.0  )
ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఖతం..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి.. అన్నట్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తయారైంది. నేతల తీరుతో కార్యకర్తలు బేజారవుతుంటే.. ఇప్పుడే తమకేదో అధికారం వచ్చినట్టు నేతలు ఆధిపత్యం కోసం అర్రులు చేస్తుండడం చూస్తే ఆ పార్టీ తీరు నవ్విపోదురుగాక... నాకేంటి సిగ్గు అన్నట్లుగా తయారైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా ఏ నియోజకవర్గానికి ఎవరు బాధ్యులో తెలియని అయోమయ పరిస్థితి ఉండగా... కొన్ని రిజర్వుడు నియోజకవర్గాలపై అగ్రవర్ణాల నేతల ఆధిపత్యం పై పార్టీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తున్నారు.

పార్టీ బలోపేతం పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తుండగా ఆ పెద్దరికం ఆయనకు ఎందుకు దక్కాలే అన్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యక్రమాన్ని మరీ పట్టుబట్టి మంచిర్యాలలో పెట్టించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెరసి శుక్రవారం మంచిర్యాల జిల్లాకు వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యక్రమం విజయవంతం చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.

తూర్పు కాంగ్రెస్ తుక్కుతుక్కు..

ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఒక్కడే తూర్పు ప్రాంతం పై ఆధిపత్యం చెలాయించడాన్ని తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రేమ్ సాగర్ వ్యవహారంపై చివరకు ఆయన సోదరుడు ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తూర్పు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రతి చోటా గ్రూపులు ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే అసలు పార్టీ ఇన్చార్జిలు ఎవరన్నది తెలియక కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ వర్గీయుడిగా డాక్టర్ గణేష్ ఎమ్మెల్యేకు పోటీ చేస్తారని తెలుస్తుండగా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆ నియోజకవర్గంలో కెరామెరి మండలం అనార్ పల్లి సర్పంచ్ తేజరావును అభ్యర్థిగా బరిలో ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి భీమ్రావు కూతురు మాజీ సర్పంచ్ సరస్వతి ఆ నియోజకవర్గంలో తాను రేవంత్ రెడ్డి అభ్యర్థిగా చెప్పుకుంటూ పార్టీలో గందరగోళ పరిస్థితికి దారి తీస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ ఉందా లేదా అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. రెండు మూడు పార్టీలు మారి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న శ్రీనివాస్ అక్కడి అభ్యర్థిగా చెబుతుండగా... పార్టీలోని ఇతర వర్గాలు ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదు.

బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్ మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రేమ్ సాగర్ రావు తన అభ్యర్థిగా చిలుముల శంకర్ ను తయారు చేశారు. గోమాస శ్రీనివాస్ కొంతకాలంగా రేవంత్ రెడ్డి సహకారంతో బెల్లంపల్లి తో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో తన కార్యకర్తలను తయారు చేసుకుంటున్నారు. మంచిర్యాలలో పార్టీకి అన్నీ తానే అని చెప్పుకుంటున్న ప్రేమ్ సాగర్ రావు ను సీనియర్ నేత కేవీ ప్రతాప్, లక్సెట్టిపేట జెడ్పిటిసి సభ్యుడు సత్తయ్య, పలువురు సీనియర్లు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్దన్ మరోసారి పోటీ చేయాలని ఆరాటపడుతుంటే... ప్రేమ్ సాగర్ ఆ నియోజకవర్గంలో రమేష్ అనే వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని చెబుతూ తిప్పుతున్నారు.

ఏలేటి రాజీనామాతో ..

కాంగ్రెస్ వరకు గ్రూపు రాజకీయాలను తట్టుకోలేక ఆ పార్టీకి రాజీనామా చేసిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డికింది ముత్యంరెడ్డి రాజీనామా చేయగా అనేకమంది పార్టీ సీనియర్లు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు జెడ్పిటిసి సభ్యులు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు భేద అభిప్రాయాలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంచిర్యాల సభపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న ప్రచారం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మల్లికార్జున్ ఖర్గే పార్టీకి ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed