సింగరేణి కార్మికులకు ‘ఎండ’ ఎఫెక్ట్.. ఆ చర్యలు తీసుకోవాలని డిమాండ్

by Anjali |   ( Updated:2024-04-19 07:16:36.0  )
సింగరేణి కార్మికులకు ‘ఎండ’ ఎఫెక్ట్.. ఆ చర్యలు తీసుకోవాలని డిమాండ్
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: ఎండలు మండిపోతుండడంతో గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. భానుడి వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటితే చాలు అడుగు తీసి బయటపెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. ఇక పగటి పూట అయితే చాలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతోంది. విద్యార్థుల‌కు ఒంటి పూట బడులు కొనసాగుతుండటంతో ఉదయం పూట వెళ్ళే సమయంలో ఏ ఇబ్బంది లేకున్నా.. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఎండ ప్రభావానికి గురవుతున్నారు. ఏవైనా బయట పనులు ఉంటే ఉదయం పది, పదకొండు లోపు చక్కబెట్టుకొని వస్తున్నారు. లేదంటే సాయంత్రం ఐదు తర్వాతే అడుగు తీసి బయటపెడుతున్నారు.

రాష్ట్రంలోనే ఇక్క‌డ రికార్డు ఎండ‌లు..

ఇక కోల్‌బెల్ట్ ప్రాంతంలో వేడికి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మంచిర్యాల‌లో రాష్ట్రస్థాయిలోనే అత్య‌ధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో తెలంగాణ‌లో అత్య‌ధికంగా 45.2 గా నమోదు అయ్యింది. చెన్నూరు మండ‌లం కొమ్మెర‌లో 45 డిగ్రీలు, ఇక నిర్మల్ బుట్టాపూర్ 44.9, కొమురం భీం జిల్లా జాంబుగ లో 44.6, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి) లో 43.8 ఉష్నోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. నాలుగు రోజుల కింద‌ట వ‌ర్షాల‌తో ఆదిలాబాద్ జిల్లా ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అయ్యారు. ఇక‌, ఇప్పుడు ఎండ‌లు సైతం దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ‌లు మ‌రింత‌గా ముదురుతాయ‌ని అధికారులు చెబుతున్నారు.

సింగ‌రేణిలో భ‌రించ‌లేక‌పోతున్న కార్మికులు..

ఓపెన్ కాస్ట్ గనుల్లో, పనిచేసే చోట్ల ఏసీ సౌకర్యంతో రెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు ఉన్నాయి. అయినా యాజ‌మాన్యం దాన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల త‌డ‌క‌ల‌తో పందిళ్లు వేస్తున్నా అవి ఎటూ స‌రిపోవ‌డం లేదు. దీంతో కార్మికులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది. డంపర్స్, షెవల్స్, డోజర్స్ వంటి భారీ వెహికల్స్‌లో ఏసీ ఉన్నా ఆ కార్మికులు బయటకు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునేందుకు ఏర్పాట్లు లేవు. సర్ఫేస్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్‌లు, సర్వే స్టాప్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎండలో మాడిపోతున్నారు. ఎండాకాలంలో గనుల్లో వేడిమిని తగ్గించడానికి, కార్మికులు పని చేసుకునేలా వాతావరణాన్ని కల్పించేందుకు యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా వదిలేసిందని ప‌లువురు కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి మీద దృష్టి పెడుతున్న యాజమాన్యం సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పూర్తి స్థాయిలో చ‌ర్య‌లు తీసుకోవాలి - ఐఎన్‌టీయూసీ బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు, పేరం శ్రీ‌నివాస్

ఎండ‌ల నుంచి రక్ష‌ణ‌కు సింగ‌రేణి యాజ‌మాన్యం పూర్తి స్థాయిలో చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న‌ప్ప‌టికీ అవి అందరికీ ఇవ్వ‌డం లేదు. ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికుల‌కు సైతం వాటిని అంద‌చేయాలి. సీఎస్పీ, స్టోర్‌ల‌లో సైతం వాటిని అందించే ఏర్పాట్లు చేయాలి. అదే స‌మ‌యంలో పందిళ్లు సైతం అంద‌రికీ అందుబాటులో ఉండేలా అధికారులు చొర‌వ తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed