అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : కలెక్టర్ రాజార్షి షా

by Aamani |
అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు :  కలెక్టర్ రాజార్షి షా
X

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. గురువారం జిల్లాలోని భీంపూర్ మండలంలో పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. ఇందులో భాగంగా ఇందూర్ పల్లి గ్రామస్తులకు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రగ్గులు, స్వెట్టర్లు, మఫ్లర్ లను పంపిణీ చేశారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారు చలి తీవ్రత కు స్పందించి ఇందూర్ గ్రామ ప్రజలకు రగ్గులు స్వెటర్లు మప్లర్లు పంపిణీ చేసినందుకు వారిని అభినందించారు.

అంతకుముందు ఇందూరు పల్లి గ్రామానికి వెళ్లిన కలెక్టర్ కు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉందని, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో చలి తీవ్రత పెరిగిందని,అల్పపీడన ద్రోణి తీరం దాటడం తో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. కొద్దిరోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించిందని అన్నారు. దట్టంగా కమ్మేసే పొగమంచు, అతి శీతల పవనాల నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, శీతాకాలం లో వచ్చే అనారోగ్య సమస్యల నుండి రక్షించుకోవాలని గ్రామస్తులను కోరారు.

ఇందులో భాగంగా మండలం అర్లిటికి వెళ్లిన కలెక్టర్ గ్రామస్తులు మంచి అలవాట్లను అలవర్చుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పొగాకు, తంబాకు, గుట్కా లాంటివి తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, అందుకు గ్రామం లో ఉన్న సమస్యల పై ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీఓ ను ఆదేశించారు. ఇందులో జిల్లా వైద్యాధికారి నరేందర్,ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షుడు సమీయుద్దీన్, మాజీ జడ్పీటీసీ సుధాకర్, మెడికల్ ఆఫీసర్లు, తహసీల్దార్ నలంద ప్రియ, ఎంపీడీఓ, గ్రామ పటేల్ దాదా రావు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story