బీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటే : రేవంత్ రెడ్డి

by Sumithra |
బీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటే : రేవంత్ రెడ్డి
X

దిశ, ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని ఆ పార్టీలకు ఓటు వేయవద్దని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ డైట్ మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను ఎంతగానో మోసం చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై నేడు అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అవినీతి పాలనతో ప్రభుత్వ ఆస్తుల అమ్మి ఖజానా నింపుకున్నారని విమర్శించారు. ఇంకా మూడవసారి అధికారం ఇవ్వాలని తమకే ఓటు వేయాలని కోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో నేటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రాజెక్టులు, కంపెనీలు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఎక్కడ కనిపించేవాడని ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు తనను ముందుగా మంత్రిని చేసింది ఎవరో తెలుసుకోవాలని హితవు పలికారు.

ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు పరుస్తాం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ తీసుకున్న ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలుపరుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఉచిత విద్యుత్ పై సంతకం చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉచిత విద్యుత్తు ఇచ్చినటువంటి దాఖలాలు లేవని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇస్తామని భరోసా కల్పించారు. అదే కాకుండా మహిళలకు ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమ ఖాతాల్లో రూపాయలు 2500 జమ చేయడంతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం రూపాయలు 15,000 అందజేస్తామని వెల్లడించారు. మోడీ ప్రభుత్వంలో వంటగ్యాసు 1200 రూపాయలు కాగ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 500 రూపాయలకే మహిళలకు సిలిండర్ అందజేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవద్దని కోరారు.

ఉచిత కరెంటు నిరూపిస్తే నామినేషన్ వెయ్యం

కాంగ్రెస్ కు ఓటేస్తే ఉచిత కరెంటు ఉండదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారం పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చినట్లయితే నిరూపించాలని సవాల్ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు ఏ సబ్ స్టేషన్ లోనైనా నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా నామినేషన్ వేయదని స్పష్టం చేశారు. ఇదే కాకుండా పేద ప్రజలకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు ఇంతవరకు ఇవ్వలేదని, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ 45 వేల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రతి అర్హులైన పేదవారికి ఐదు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డినీ గెలిపించేందుకు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇకపోతే టికెట్ల విషయంలో కొందరు ముఖ్య సీనియర్ నాయకులు రాజీనామాలు చేస్తామని స్పష్టం చేయడం సమంజసం కాదన్నారు. వారి సేవలను గుర్తించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత న్యాయం కల్పిస్తామని తెలిపారు. టికెట్ల కేటాయింపులు పార్టీ పరిస్థితులు, స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని సోనియా గాంధీ, ఖర్గే ఆదేశానుసారం ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగిందని అన్నారు. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. సభలో ఏఐసీసీ సభ్యులు అబ్బాస్, ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్, పార్టీ సీనియర్ నాయకులు గోక గణేష్ రెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి యూత్ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed