మంచిర్యాలపై పురాణం గురి.. టికెట్ యత్నాల్లో మాజీ ఎమ్మెల్సీ

by Mahesh |
మంచిర్యాలపై పురాణం గురి.. టికెట్ యత్నాల్లో మాజీ ఎమ్మెల్సీ
X

దిశ ప్రతినిధి, నిర్మల్: మాజీ శాసన మండలి సభ్యుడు, భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నేత పురాణం సతీష్ వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల అసెంబ్లీ బరిలో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని ఆయన సన్నిహితులు తాజాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఆదివారం చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన పురాణం సతీష్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు ఆసక్తితో ఉన్నట్లు సన్నిహితులతో చెప్పడం తాజా రాజకీయాలకు వేడెక్కించింది. మంచిర్యాలలో సిట్టింగ్ శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను లేకపోతే తన తనయుడు విజిత్ రావ్ బరిలో ఉండేలా ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో తాజాగా పురాణం సతీష్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ అధిష్టానం చెంతకు వెళుతుండటం సర్వత్రా భారత రాష్ట్ర సమితి వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

పార్టీకి సేవ చేసిన నేపథ్యంలోనే..

తెలంగాణ ఉద్యమం అంతంతగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పురాణం సతీష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు. కోటపల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మంచిర్యాల, చెన్నూరు తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారన్న పేరు ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ను తట్టుకొని తూర్పు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టారని కూడా పేరు పొందారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోవ లక్ష్మిని గెలిపించే విషయంలోనూ ఆయన కీలకపాత్రను పోషించారు. ఆ క్రమంలోనే ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

అప్పటి నుంచి తూర్పు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు అయితే మారిన రాజకీయాల నేపథ్యంలో తూర్పు జిల్లా సీనియర్లు కొందరు ఏకమై పురాణం సతీష్ ను రాజకీయంగా తొక్కి పెట్టారు. దీంతో ఆయన తీవ్ర అంతర్మధనానికి గురయ్యారు. ఒక సందర్భంలో ఆయన పార్టీ వీడుతారని కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ తదితరులతో ఉన్న సంబంధాల నేపథ్యంలో అధికార పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీకి ఎన్నో సేవలు చేసినప్పటికీ మరోసారి తనకు ఎమ్మెల్సీ రెన్యువల్ చేయకపోవడంపై మనస్థాపం చెందారు. రాజకీయంగా అణచివేతకు గురయ్యారు. వాటన్నింటినీ తట్టుకుంటూ రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొని వస్తున్నారు.

మంచిర్యాలపై ఆశలు..

పురాణం సతీష్ చెన్నూరు నియోజకవర్గానికి చెందిన నేతగా రాజకీయాల్లో ఉన్నారు. తాజాగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన బెల్లంపల్లి నియోజకవర్గంలోకి వెళ్లారు. రాజకీయంగా బలంగానే ఉన్నప్పటికీ ఆయనకు అధికార పదవులు పొందేందుకు చెన్నూరు బెల్లంపల్లి రెండు నియోజకవర్గాలు రిజర్వుడు కావడంతో ఆయనకు అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తనకు మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వస్తున్న కేటీఆర్‌ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారని పురాణం సతీష్ సన్నిహితులు దిశ ప్రతినిధికి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed