బెల్లంపల్లిలో నార్కోటిక్ డాగ్ తనిఖీలు కలకలం..!

by Kalyani |
బెల్లంపల్లిలో నార్కోటిక్ డాగ్ తనిఖీలు కలకలం..!
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నార్కోటిక్ డాగ్ తనిఖీలు కలకలం రేపాయి. బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం గంజాయి నిర్మూలనే ప్రధాన లక్ష్యంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి సేవించే వారి ఇండ్లలో నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలోకి డాగ్ తో వెళ్లి పరిశీలించడం పట్టణంలో సంచలనంగా మారింది. నార్కోటిక్ డాగ్ ఇళ్లలోకి వెళ్లి తనిఖీతో పాటు ఇంటి పరిసరాల్లో గంజాయి కోసం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ మాట్లాడుతూ… చిన్న వయసులో చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని వాపోయారు.

యువకులు గంజాయికి అలవాటు పడి ఆర్థికంగా, శారీరకంగా అనారోగ్యం పాలవుతున్నారన్నారు. కొంతమంది యువత విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని సులభంగా డబ్బులు సంపాదించాలనే చెడు ఆలోచనతో పక్క రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలతో పాటు గంజాయి సేవించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ఎవరైనా గంజాయి విక్రయం, గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులకు సహకరించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ అఫ్జలుద్దీన్ తెలిపారు. ఈ తనిఖీలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై మహేందర్ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed