తెరపైకి మళ్ళీ కొత్త మండలాల లొల్లి..

by Sumithra |
తెరపైకి మళ్ళీ కొత్త మండలాల లొల్లి..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు అంశం మళ్లీ ఆందోళనకు దారి తీస్తున్నది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా తీసుకుని నిర్ణయం కొత్త మండలాల కోసం ఆయా ప్రాంతాల్లో గొడవలకు దారి తీసేలా కనిపిస్తోంది. కొత్త జిల్లాలో ఏర్పాటు సమయంలో రెవెన్యూ డివిజన్లతో పాటు కొన్ని మండలాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఎన్నికల సమయంలో డిమాండ్ పెరగడంతో మరికొన్ని రెవెన్యూ డివిజన్ లతో పాటు కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి హడావిడిగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తమకు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయని సంబరాలు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. కొత్త మండలాల ప్రస్తావన మళ్ళీ తెరపైకి రావడం... కొన్ని మండలాలను ప్రకటించడం, మరికొన్నింటి పై స్పష్టత ఇవ్వకపోవడంతో, ఒకవైపు చర్చతో పాటు మరోవైపు ఆందోళనలకు దారితీస్తున్నది.

కొత్త మండలాల పై ఆందోళనలు షురూ... అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రస్తావన..

ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పాత ఆదిలాబాద్ కాకుండా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో పలు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలో బాసర, నర్సాపూర్ జి, దస్తురాబాద్, సోన్, పెంబి, నిర్మల్ అర్బన్ మండలాలను ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లాలో కన్నేపల్లి ఆసిఫాబాద్ జిల్లాలో లింగాపూర్, చింతల మానేపల్లి, పెంచికల్ పేట, ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ మండలాలు ఏర్పాటు అయ్యాయి. అప్పుడే తూర్పున బెల్లంపల్లి, కాగజ్ నగర్, చెన్నూర్, పశ్చిమ జిల్లాలో బైంసా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఆదరాబాదరగా మళ్లీ కొన్ని రెవెన్యూ డివిజన్ లు, మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ వెంటనే పలు గెజిట్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. దీంతో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు అయినట్లేనని ఆయా ప్రాంతాల్లో జనం సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే మళ్లీ తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలాల ప్రస్తావనను మళ్ళీ తెరపైకి తెచ్చింది. వీటిపైనే మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ముధోల్ శాసనసభ్యుడు రామారావు పటేల్, బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు తదితరులు కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్ల విషయం అసెంబ్లీ దృష్టికి తేవడంతో వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది.

కొన్ని ప్రకటించి.. మరికొన్నింటి పై స్పష్టత లేక..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక మండలాలు కొన్ని రెవెన్యూ డివిజన్లను ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు హామీ ఇచ్చారు. మండలాల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో మాలేగాం, బెల్ తరోడా, పల్సి, పొన్ కల్, బీరవెల్లి మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో సోనాల, మావల, సాత్నాల మండలాల పై అప్పటి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వెనువెంటనే గెజిట్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మండల ఏర్పాటు పక్కన పెట్టేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొత్తగా మూడు మండలాలను ప్రకటిస్తూ చర్యలు తీసుకున్నది. ఇందులో సోనాల సాతనాల మావల మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగతా మండలాలు రెవెన్యూ డివిజన్ల పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై మళ్ళీ ఆందోళనలు మొదలవుతున్నాయి. మరోవైపు అసెంబ్లీలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్, మండలాల ఏర్పాటు పై ప్రశ్నలు లేవనెత్తి ప్రభుత్వం పై ఒత్తిడి తేవడంతో మళ్లీ కొత్త మండలాల ఏర్పాటు అంశం బలంగా తెరపైకి వచ్చినట్లు అవుతోంది.

Advertisement

Next Story