Assembly : గురుకులాలపై మంత్రులు సీతక్క, పొన్నం వర్సెస్ గంగుల

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-18 12:16:41.0  )
Assembly : గురుకులాలపై మంత్రులు సీతక్క, పొన్నం వర్సెస్ గంగుల
X

దిశ, వెబ్ డెస్క్ : గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల(Gurukuls, government schools) సమస్యలపై స్వల్పకాలిక చర్చలో శాసన సభ(Assembly)లో మంత్రులు సీతక్క(Seethakka), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) కు, మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalaker)కు మధ్య మాటాల యుద్దం సాగింది. ప్రభుత్వం వైపు నుంచి సీతక్క గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు చేపట్టిన చర్యలను ఏకరువు పెట్టారు. గురుకులాల్లో , హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొత్తగా చోటుచేసుకున్నట్లుగా ప్రతిపక్షం చెప్పడం విడ్డూరమని, గతం నుంచి కూడా అలాంటి ఘటనలు సాగుతున్నాయని, వాటికి తమ ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ఆహార భద్రత కమిటీ, టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసిందన్నారు. డైట్ చార్జీలను 50శాతం చెప్పడం జరిగిందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని, కమిటీల ద్వారా 21,941పాఠశాలలు, 495కేజీబీవీల్లో అత్యవసర పనులు గుర్తించి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ విద్యార్థినిలు శైలజా, భవాని, లీలావతిల గూర్చి, గురుకులాల సమస్యలపై మంత్రి మాట్లాడుతారని ఆశించామని కాని మంత్రి సీతక్క వాటిని ప్రస్తావించలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తెలంగాణ రాకముందు 261గురుకులాలు ఉంటే 7,500మంది విద్యార్థులకే చదివే అవకాశముంటే కేసీఆర్ హయంలో 1029 గురుకులాల ఏర్పాటుతో మెరుగైన విద్యను అందిస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు మొదలయ్యాయన్నారు. ఫుడ్ పాయిజన్లు, పాముకాట్లు, ఎలుక కాట్లతో గురుకులాలు ప్రాణాంతకంగా మారాయన్నారు. హీరో వస్తే ఒకరు చనిపోతే క్రిమినల్ కేసులు పెట్టారని, గురుకులాల్లో మరణాలపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ 2014నుంచి గురుకులాల అద్దెలు చెల్లించని మీరా మాట్లాడేదంటూ మండిపడ్డారు. మేం 216ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కడుతున్నామన్నారు. మేం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుకున్న వారిగా మాకు వాటి సమస్యలు తెలుసన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన గంగుల కమలాకర్ కు వాటి సమస్యలు తెలియవన్నారు. గురుకులాలను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. మొదటిసారి సభకు వచ్చిన పొన్నంకు సభా నియమాలు తెలియవని గంగుల వ్యాఖ్యానించగా, మూడుసార్లు పార్టీ మారిన నీవా మాట్లాడేదంటూ విరుచుకపడ్డారు. గంగుల మళ్లీ మాట్లాడుతూ పెప్పర్ స్పే డూప్లీకేట్ నా, దొంగ ఏడుపులా అని నేను అనలేదని, కరీంనగర్ నుంచి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని వేరే నియోజకవర్గానికి పారిపోయావని పొన్నంపై విమర్శలు చేయగా, పెప్పర్ స్ప్రే ఓరిజినల్ కాదా అనేది పార్లమెంటు ప్రొసిడింగ్స్ లో చూసుకోవచ్చని పొన్నం ప్రతిస్పందించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నా స్థానంలో పోటీ చేయ్ అని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా అనేక మంది జాతీయ నాయకులు కూడా వేరే చోట్ల పోటీ చేశారని పొన్నం గుర్తు చేశారు. వారంతా పారిపోయారా అని పొన్నం నిలదీశారు.

మంత్రి సీతక్క జోక్యం చేసుకుని చర్చను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ వ్యక్తిగత విమర్శలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరుతున్నామన్నారు. పాఠశాలలు, హాస్టల్ సమస్యలపై చర్చించకుండా రాజకీయ విమర్శలు చేయడం ఎందుకన్నారు. రికార్డులను పరిశీలించి వ్యక్తిగత దూషణాలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చర్చను కొనసాగిస్తూ బీఆర్ఎస్ పాలనలో విద్యా విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టి, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ఏకరువు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed