మాయమాటలతో మరొకసారి మోసం చేసిన కేసీఆర్.. వేరబెల్లి రఘునాథ్

by Sumithra |   ( Updated:2023-06-12 13:08:49.0  )
మాయమాటలతో మరొకసారి మోసం చేసిన కేసీఆర్.. వేరబెల్లి రఘునాథ్
X

దిశ, నస్పూర్ : సింగరేణి కార్మికులకు మాయమాటలు చెప్పి మరొకసారి కార్మికులను కేసీఆర్ మోసం చేశారని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు వస్తే ఎన్నో వరాలు ప్రకటిస్తాడని జిల్లా ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూశారని, కానీ జిల్లా ప్రజలకు కేసీఆర్ మొండిచేయి చూపించారని అన్నారు. కార్మికులకు 700కోట్ల రూపాయల లాభాల బోనస్ ప్రకటించిన కేసీఆర్, ఆ లాభాలు కార్మికులు కష్టపడి పని చేస్తే వచ్చిన ఆదాయం తప్ప, కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేటాయించింది కాదని అన్నారు. గత ఎన్నికల సమయంలో 400 కోట్లు విడుదల చేశామని చెప్పిన కేసీఆర్, 400 కోట్ల రూపాయలు, 06 కొత్త బొగ్గు గనులు, 6000 కొత్త ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. విదేశాల నుండి మోదీ బొగ్గు తెస్తున్నారని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేశంలో ప్రతి ఏడాది 1250 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటే, దేశంలో అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థల ద్వారా 1000 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, మిగతా 250 మిలియన్ టన్నుల బొగ్గు విదేశాల నుండి కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

విదేశాల నుండి బొగ్గు కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం తీసుకు వచ్చిందని, కానీ సింగరేణి సంస్థను వేలంలో పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకొని ఆ గనులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు సింగరేణి సంస్థకు 20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, కేసీఆర్ మాత్రం సింగరేణి సంస్థకు బకాయిలు చెల్లించకుండా సింగరేణి సంస్థను అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరొకసారి మంచిర్యాల సభలో మాయమాటలు చెప్పి మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అగల్ డ్యూటీ రాజు, నాయకులు పానుగంటి మధు, సత్రం రమేష్, తోట మల్లికార్జున్, మిట్టపల్లి మొగిలి, సమ్రాజ్ రమేష్, మడిశెట్టి మహేష్, కుర్రే చక్రి, సిరికొండ రాజు, తాడూరి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed