ఆదివాసీ యువత అన్ని రంగాల్లో రాణించాలి: జిల్లా ఎస్పీ

by S Gopi |
ఆదివాసీ యువత అన్ని రంగాల్లో రాణించాలి: జిల్లా ఎస్పీ
X

దిశ, ఇచ్చోడ: దేశం అభివృద్ధి దిశలో మరింత ముందుకు సాగాలంటే, ఆదివాసీ యువత అన్ని రంగాల్లో రాణించాలని, విద్యతోపాటు వ్యాపారం, వ్యవసాయ రంగాలలో కూడా పురోగతిని సాధించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని దుబార్ పేట గ్రామంలో బుధవారం సాయంత్రం ఆదివాసీ బిర్థు గొండ్(తోటి), యువ సమ్మేళన, పోలీసులు మీ కోసంలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుండి యువతకు విద్యపై ఆసక్తి కలిగేలా గ్రామ పెద్దలు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ తరపున ఒక ఆదివాసీ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరైన పద్ధతిలో విద్యపై అవగాహన కల్పిస్తూ, ఉపాధి మార్గాన్ని తెలియజేస్తూ అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో అవార్డులను, పథకాలను సాధించిన పది మంది యువతను శాలువాతో సత్కరించి బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.

నిర్మన్ ఆర్గనైజేషన్ సహకారంతో 25 మంది విద్యార్థులకు 16 పుస్తకాలతో కూడిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. గ్రామస్తుల సహకారంతో 25 మందికి కానిస్టేబుల్ పరీక్షకు ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 15 పుస్తకాలతో కూడిన సెట్లను అందజేశారు. అదేవిధంగా జిల్లా పోలీసుల ద్వారా 25 గ్రామాలకు 25 వాలీబాల్ కిట్లను అందజేశారు. త్వరలో జిల్లా పోలీసుల తరఫున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఆదివాసీలకు ఒక్కొక్కరికి 17 రకాల పుస్తకాలను అందజేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, సీఐ ఎం నైలు, గ్రామ పటేల్ వెడ్మ జీవంతరావు మహరాజ్, ఏజెన్సీ డీఎం & హెచ్ ఓ మనోహర్, సంఘం అధ్యక్షుడు నారాయణ, తిరుపతి, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed