- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జారి పోకుండా జాగ్రత్తలు.. నేతల్లో ధైర్యం నూరిపోసేందుకు పార్టీ చీఫ్ ప్రయత్నాలు
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెడితే బీఆర్ఎస్ పార్టీ నేతలు జారిపోకుండా జాగ్రత్త పడుతోంది. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు ఎక్కడ పార్టీ మారతారో అని కారు పార్టీ అలర్ట్ అయ్యింది. జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే, ముఖ్య నాయకులతో సమావేశమవుతున్నారు. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలను పిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆసిఫాబాద్, బోథ్‌లో ఎమ్మెల్యేలను గెలుచుకుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. తాజాగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. అందులో భాగంగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్లను ఎరవెల్లి ఫాం హౌస్‌కు పిలిపించి కేసీఆర్, కేటీఆర్ భేటీ అయ్యారు. వీరిద్దరితో చర్చలు జరిపారు.
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు
ఇక్కడి నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర మాజీ ఎమ్మెల్యేలు చేరిపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖానాపూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా రేఖానాయక్, బోథ్, సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, రాథోడ్ బాపూరావు అందరూ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారితో సహా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఉన్న వాళ్లని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో క్యాడర్, లీడర్లు నైరాశ్యంలో మునిగిపోయారు. వారిలో ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఈ భేటీలు జరుగుతున్నట్లు సమాచారం.
నేతల్లో ధైర్యం నూరిపోసేందుకు పార్టీ చీఫ్ ప్రయత్నాలు
అందరూ వరుసగా కాంగ్రెస్ గూటికి వెళ్తుంటే మిగతా వారు నిరాశకు లోనుకాకుండా, దారి తప్పకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌పై ఫోకస్ పెట్టారు పార్టీ చీఫ్. నేతలకు భుజం తట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు మంచి రోజులు వస్తాయని అప్పటి వరకు వేరే పార్టీల వైపు చూడొద్దంటూ చెబుతున్నారు. అదే సమయంలో, కింది స్థాయి నాయకులు, నేతలకు ధైర్యం చెప్పాలని వారు సైతం పార్టీ మారకుండా తీసుకోవాల్సిన అంశాలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. అదే విషయాన్ని ఆయా జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలకు స్పష్టం చేస్తున్నారు.
భేటీలతో కొనసాగేనా..?
అయితే, అధినేత భరోసా ఇస్తున్నప్పటికీ ఈ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు దారి తప్పకుండా ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో పాటు నిధులు తీసుకురావడం, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం అవుతుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలుగురు బీజేపీ, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీలోనే ఉంటారా..? లేక వెళ్లిపోతారా...? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నిధులు రావని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. మరి నైతిక విలువలకు కట్టుబడి ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే విషయంలో సైతం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.