ఉమ్మడి జిల్లాలో ‘హైడ్రా’ హడల్..! ఎఫ్టీఎల్ పరిధిలోని నివాసాలకు నోటీసులు జారీ

by Shiva |
ఉమ్మడి జిల్లాలో ‘హైడ్రా’ హడల్..! ఎఫ్టీఎల్ పరిధిలోని నివాసాలకు నోటీసులు జారీ
X

దిశ, ప్రతినిధి/నిర్మల్: హైదరాబాద్ నగరంలోని ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలను ‘హైడ్రా’ కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చెరువుల హద్దుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే చెరువుల హద్దులను గుర్తించిన అధికారులు కొందరికి నోటీసులు కూడా జారీ చేసినట్లుగా సమాచారం. ముఖ్యంగా నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా కేంద్రాలతో పాటు పలు మున్సిపాలిటీలలో చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి ఆక్రమణదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కోర్టు కేసులు నడుస్తున్న నేపథ్యంలో నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు సంబంధిత చెరువుల వాస్తవ విస్తీర్ణం, ఆక్రమణకు గురైన స్థలాలు, వాటి పూర్తి వివరాలను కోర్టులకు సమర్పించారు.

ఉమ్మడి జిల్లాలో చెరువుల కబ్జాలు ఇలా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక చెరువులు పెద్ద మొత్తంలో కబ్జాలకు గురయ్యాయి. ముఖ్యంగా మున్సిపల్ కేంద్రాలుగా ఉన్న పలు పట్టణాల్లో చెరువుల కబ్జాలు భారీగా జరిగాయి. ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్ సహా కొత్త జిల్లాలుగా ఏర్పడిన నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో ఉన్న అనేక చెరువులు, నాళాలు కబ్జాలకు గురై కుచించుకుపోయాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న రాముని చెరువు, పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ ఏర్పడడానికి ముందు ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురయ్యాయి. ఇప్పుడు ఆ చెరువు ఆనవాళ్లే లేకుండా పోయాయి. అదేవిధంగా జన్నారం మండల కేంద్రంలోని ఓ చెరువు భారీగా ఆక్రమణలకు గురైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో ఉన్న ఖానాపూర్ చెరువు వద్ద ట్యాంక్‌బండ్ నిర్మాణం పేరుతో అప్పటి అధికార పార్టీ నాయకులు కబ్జాలు పెట్టారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల పరిధిలో ఉన్న భారీ తటాకంలోకి 200 ఫీట్ల మేర లోపలికి కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

మరోవైపు చెరువు ఎఫ్‌టీ‌ఎల్ పరిధిలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఓ ఫంక్షన్ హాల్ సైతం చెరువు పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపై అనేక ఫిర్యాదులు వెళ్లినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గిన అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఓ నేత అండదండలతో కబ్జాకోరులు భారీ‌గా ఆక్రమణలు చేశారని, అందులోనూ సదరు నేతకు వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖానాపూర్ చెరువు హద్దులు గుర్తించి ఆక్రమణదారుల అంశాన్ని తేల్చారు. వారికి నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిమ్మనాయుడు కాలం నాటి గొలుసు కట్టు చెరువులు కూడా కబ్జాకు గురయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టణ నడిబొడ్డుతో పాటు పట్టణం చుట్టూ సుమారు 13 పెద్ద చెరువులు ఉన్నాయి. కబ్జాల కారణంగా ఆ చెరువులు ఇప్పుడు సగం విస్తీర్ణం కూడా లేకుండా పోయాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు, పాఠశాలల సముదాయాలు, వాణిజ్య భవనాలు నిర్మాణం కూడా జరిగిపోయాయి. అయితే, ఆయా చెరువుల హద్దులను గుర్తించిన అధికారులు కోర్టు కేసుల నేపథ్యంలో రికార్డులను హైకోర్టుకు అందజేశారు.

హైడ్రా లాంటి బుల్డోజర్ రావాలి..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణలను తొలగించాలంటే హైదరాబాద్‌లో జరుగుతోన్న ఆపరేషన్ హైడ్రా లాంటి బుల్డోజర్‌ను తమ జిల్లాకు తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ పట్టణాలతో పాటు కొన్ని మండల కేంద్రాల్లోనూ భారీగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. భవిష్యత్తు తరాలకు బహుళ ప్రయోజనాలు అందించే చెరువుల పరిరక్షణ జరగాలంటే ఇలాంటి కఠిన చట్టాలతో కూడిన సంస్థలకు అధికారం ఇవ్వాలని ఉమ్మడి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గొడవకు దిగుతున్న జనం..

చెరువుల ఆక్రమణలకు సంబంధించి హద్దుల మార్కింగ్ కోసం వెళ్తున్న అధికారులతో ఆక్రమణదారులు, బాధితులు గొడవకు దిగుతున్నారు. ఇటీవలే ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్ చెరువు హద్దులను గుర్తించేందుకు వెళ్లిన అధికారులపై బాధిత కుటుంబాలు ఎదురు తిరిగాయి. ఎవరో ఆక్రమించి తమకు ప్లాట్లు చేసి అమ్మితే.. తాము ఇళ్లు కట్టుకున్నామని ఇప్పుడు ‘హైడ్రా’ పేరుతో మార్కింగ్ చేసి కూలిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నోటీసులు తీసుకున్న వారు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇది రాజకీయ పార్టీల నడుమ గొడవకు కూడా దారితీస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు ఓ ఆయుధంగా మారుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని పొలిటికల్ కార్నర్‌గా మార్చుకుంది. ఇదే పరిస్థితి మిగతా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed