Pakisthan: సైనిక స్థావరాలపై దాడి.. పాక్‌లో 25 మంది పౌరులకు జైలు శిక్ష

by vinod kumar |
Pakisthan: సైనిక స్థావరాలపై దాడి.. పాక్‌లో 25 మంది పౌరులకు జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది మేలో మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నేత ఇమ్రాన్‌ఖాన్‌ను (Imran khan) అరెస్టు చేసిన తర్వాత చెలరేగిన అల్లర్లలో సైనిక స్థావరాలపై దాడి చేసినందుకు గాను 25 మంది పౌరులకు పాక్ మిలిటరీ కోర్టు (Militery court) జైలు శిక్ష విధించింది. సైనిక కేంద్రాలపై దాడిలో వీరందరూ దోషులుగా తేలగా రెండేళ్ల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించినట్టు సైనిక దళాల మీడియా విభాగం శనివారం తెలిపింది. ఈ కేసులో మొత్తంగా 103 మందిపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా14 మందికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా, 11 మందికి తక్కువ కాలం విధించారు. మిగతా వారికి సైతం త్వరలోనే శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. దేశానికి న్యాయం అందించడంలో ఇదొక కీలక మైలురాయి అని సైన్యం అభివర్ణించింది.

కాగా, ఇమ్రాన్ ఖాన్ 2018 నుంచి 2022 వరకు పాక్ ప్రధాన మంత్రిగా పని చేశారు. అయితే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండగా గతేడాది మేలో అరెస్ట్ చేశారు. అనంతరం ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ పీటీఐ మద్దతు దారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఫైసలాబాద్‌లోని ఐఎస్ఐ భవనంతో సహా అనేక సైనిక స్థావరాలపై దాడి చేశారు. అంతేగాక ఓ ఉన్నతాధికారి ఇంటిని తగులబెట్టారు. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అనేక మందిని అరెస్టు చేసి విచారణ చేపట్టి తాజాగా పలువురిని దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేసింది.

Advertisement

Next Story

Most Viewed