రాత ఢలేగీ... ఇక్భాల్ కవితా సంకలనంకి ముందుమాట

by M.Rajitha |
రాత ఢలేగీ... ఇక్భాల్ కవితా సంకలనంకి ముందుమాట
X

దిశ, వెబ్ డెస్క్ : విరసం సీనియర్‌ కవి ఇక్బాల్‌ అపూర్వ సాహసిక ఉర్దూ కవితా సంకలనం ఉర్దూ తెలుగు ఇంగ్లీషు భాషల్లో వెలువడుతున్నది. అపూర్వం ఎందుకంటే అమరుడు యం.టి.ఖాన్‌ మొదలుకొని విరసంలో ఎవరూ పుట్టుక వల్ల ముస్లీంలైన కవులు ఉర్దూ భాషలో (లిపితో సహా) తమ కవిత్వాన్ని ప్రచురించే ప్రయత్నం చేయలేదు. ఖాన్‌సాబ్‌ వృత్తిరీత్యా ‘సియాసత్‌’ ఉర్దూ దినపత్రికకు హైదరాబాద్‌లో కాలమ్‌ రాశాడు. సామాజిక సాహిత్య వ్యాఖ్యానాలు రాసాడు. ఆర్ట్‌ మీద సమీక్షా వ్యాసాలు రాసాడు. అవన్నీ ఆయన అమరత్వం (అనారోగ్యంగా ఉండగానే) తర్వాత సంకలనం చేసి ఇస్తానన్న జహీర్‌ అలీఖాన్‌ గద్దర్‌ మరణించిన సాయంత్రమే జనసమ్మర్థంలో ఊపిరాడక మరణించడం హిందూ ముస్లిం తెహజీబ్‌కే కాదు ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామ్య పోరాటానికి కూడా ఒక తీరని లోటు. ఇప్పుడిరక ఆయన అన్న సియాసత్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ జాహిద్‌ అలీఖాన్‌ గారు కూడా ఇటీవలే మరణించి ఆ వెలితి ఇంకా పెరిగింది.

అయితే కామ్రేడ్‌ ఖాన్‌సాబ్‌ నాటికన్నా ఇక్బాల్‌ ఈ ఉర్దూ కవితా సంకలనం తెచ్చే నాటికి సమాజంలో విప్లవ చైతన్యంతో పాటు ముస్లిం అస్థిత్వ ప్రకటన ఒక అవసరమైన ధిక్కార స్వరమైంది. కాలాలు, సందర్భాలు ఎప్పుడు దేనికి ఒక అవసరాన్ని కల్పిస్తాయో సామాజిక స్పందనను బట్టి మనం కంటి మీద రెప్ప వాలకుండా కనిపెట్టుకొని ఉండాలి.

ఇప్పుడీ దేశానికి మూడోసారి కూడా ప్రధాని అయ్యే ప్రమాదమున్న నరేంద్రమోడీ ఎన్నికల చివరి రోజుల్లో రాజస్థాన్‌లో ప్రారంభించి ఉత్తర ప్రదేశ్‌, ఢల్లీి దాకా చేసిన ఎన్నికల విషప్రచారం, వాడిన ‘ఓటు జిహాద్‌’ భాషా సందర్భంలో... ఔను నేను గౌరిని మాట్లాడుతున్నాను అని ఉద్యమం వలె, అవును నేను అర్బన్‌ మావోయిస్టునన్న బుద్ధిజీవులు గిరీష్‌ కర్నాడ్‌ ప్రకటన వలె, అవును నేను ముస్లింను పుట్టుక వలన, అస్థిత్వం వలన. అయితే ఏం నేను ఏ దేశ వాసిని. ఈ దేశ ప్రజలదయిన ఒకప్పుడు ఇరవయో దశాబ్దపు ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం, మన దేశంలో బెంగాల్‌ కరువు, బెంగాల్‌ విభజన కాలం నుండి కాకోరీ, లాహోర్‌, మీరట్‌ కుట్ర కేసుల కాలం నుండి దేశ విభజన కాలం దాకా సామ్రాజ్యవాదం, ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక భావజాలానికి ఒక బలమైన వాహిక అయిన ప్రజల భాష, కళల భాష, సాహిత్య భాష, సంగీత భాష ఉర్దూను మీరు ` హిందుత్వ బ్రాహ్మణీయవాదులు ‘గుస్‌పైఠియా’ చొరబాటుదారుల భాషగా చర్యగా పేర్కొంటున్న ‘లవ్‌ జిహాద్‌’ల భాష ఒక మతభాష కాదని ప్రజాహిత భాష జనామోద భాష అని చెప్పదలుచుకుంటున్నాడు ఇక్బాల్‌.

ఈ పని ఆయన మావోయిజాన్ని ఒక దిశానిర్దేశన దార్శినికతతో అర్ధ శతాబ్దం పైగా పని చేస్తున్న విప్లవ రచయితల సంఘంలో నాలుగు దశాబ్దాల సభ్యుడిగా చేస్తున్నాడు. యాదృచ్ఛికమేమీ కాకపోవచ్చు విరసం ఇచ్చిన ఆశ్వాసమే కావచ్చు. 1985 జనవరిలో గద్వాల్‌లో నిర్వహించిన మతవర్గ తత్వమూలాలను అన్వేషించి సమూలంగా నిర్మూలించాలనే సాంస్కృతిక కృషి సంకల్పం కోసం జరిగిన సభ నాటికే 1984 జనవరిలో విరసం సభ్యుడయ్యాడు. ఈ నలభై ఏళ్ళలో ఆయన విరసంలో ఎంతగా మమైక్యమయ్యాడంటే, ఆ సంస్థ కోసం ఆయన ప్రాణం అల్లాడుతుంది. జో గోద్‌ మే మై జిందగీ భర్కా దర్ద్‌ భులా... ఏ కౌగిట్లో నేను బతుకు బాధలన్నీ మరిచానో అని ఆరంభమయ్యే కవితలో అయ్‌ క్రాంతికార్‌ లేఖక్‌ సంఘటన్‌... బినా తేరే మై హూఁ కహాఁ ఓ క్రాంతికారీ కలం యోధుల వేదికా నువ్వు లేకుండా నిజానికి నేనెక్కడని, నువ్వే గుండెలయవు, నువ్వే బతుకు శ్వాసవు. ఇంక్విలాబ్‌ ఇంక్విలాబ్‌ తూహీ దిల్‌ కీ ధడక్‌ విప్లవమా వర్థిల్లు విప్లవమా వర్థిల్లు అని పిడికిలెత్తాడు.

విరసంలో చేరిన సంవత్సరం నుంచి కవితా సంకలనాలు ప్రకటిస్తున్నాడు. ఈ సంపుటి కంటే ముందు స్పందన (1985) నుండి ఈ సంపుటి వరకు ఆరు కవితా సంకలనాలు ప్రచురించాడు. అయితే తెలుగులో గీతం వలె ఉర్దూలో ముషాయిరాలలో ఆలపించే షాయరీల వలె శృతిలయలకు స్పందించే శబ్ద గుణం కవిత్వంలో ఉండాలని అది సరళంగా, స్పష్టంగా ఉండాలని ఆయన చెరబండరాజు ఆదర్శంగా ఎంచుకున్నాడు. అటువంటి ప్రయోగాలు తెలుగులో గత నలభై సంవత్సరాలుగా చేస్తూనే తెలుగు పాఠకులకు ఏడున్నర దశాబ్దాల నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ విప్లవ భావాలు ఉర్దూ పాఠకుల అందుబాటులోకి కూడా తేవాలనే ప్రయత్నం. ఆయన ఒక ప్రయోగంగా సేద్యం (2011)లో చేసాడు. అది గుర్తు చేయడానికే మళ్ళీ ఇందులో అందులో వచ్చిన సారే జహాఁసే.. అనే కవితతోనే తన కవితా సంకలనాన్ని ప్రారంభించాడు.

విప్లవ రచయితగా ఇక్బాల్‌ భాష, ప్రక్రియ, గీతం, పాట, వచన కవిత, కథ ఏదయినా ఒక విషయ దృక్పథ వాహిక అనే ఎరుక చిత్తశుద్ధిగా ఉన్నవాడు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో సామ్రాజ్యవాద వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో దేశ స్వాతంత్య్రాన్నీ, దేశాభిమానాన్నీ, ఏ కవి కన్నా కూడా అద్భుతంగా చెప్పిన కవి అల్లామా ఇక్బాల్‌. ఆయన ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ వంటి విప్లవ కవికి కూడా తొలి దిశా నిర్దేశం చేసిన తత్వవేత్త కవి.

అప్పుడు అపుడేమిటి దేశవిభజన కాలం దాకా ఆ మాటకి ఈనాటికీ ఉర్దూ కవులందరూ అసంకల్పితంగానే ఇండియాను హిందూస్థాన్‌ అనే పిలిచారు. ఉర్దూ భాషీయులందరూ అట్లాగే పిలుస్తారు. ఖడీబోలీ హిందూస్థానిలో రాసేవాళ్ళూ అట్లాగే పిలుస్తారు. అందుకే ఆయన సింధూ నదికి ఇండస్‌ వ్యాలీకి ఈవల ఉన్న ఈ భౌతిక భూభాగాన్ని హిందూస్థాన్‌ అని అందరి లాగే పిలిచి...

సారే జహాఁసె అచ్ఛా హిందుస్థా హమారా

హిందూ సితా హమారా...

అని ఇక్కడి మట్టి వైవిధ్యాన్ని, ఇక్కడ రుతువుల వైవిధ్యాన్ని వర్ణించే గీతం రాసాడు.

కాని క్రమంగా ముప్పైల నాటికే సామ్రాజ్యవాద వలసవ వాద వ్యతిరేక పోరాటంలోని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, హిందూ మహాసభ, ఆర్‌.ఎస్‌.ఎస్‌., గీతాప్రెస్‌, ఆర్యసమాజ్‌ భావజాల ప్రభావంలోకి ముస్లింలు 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఈ దేశపు రైతాంగ సంతానమనే భావం నుండి జాతీయోద్యమంకూ మెజారిటీ మత భావనకు మధ్య వ్యక్తికి, సమష్టికి ఆచార వ్యవహారాలకు రాజకీయార్థిక వ్యవహారాలకు మధ్యన విభజన చెరిగిపోతున్నదనే అభద్రతా భావానికి గురయ్యే స్థితి వచ్చింది. 1926 బెంగాల్‌లోని కృష్ణగఢ్‌ జిల్లా కేంద్రంలో జరిగిన గాంధీజీ హాజరయిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ మహాసభలోనే విద్రోహి కవి నజ్రుల్‌ ఇస్లాం ‘కందహారీ హోషియార్‌’ జాలరీ జాగ్రత్త అని హిందూ ముస్లిం మత విద్వేశాలను రెచ్చగొట్టే వాళ్ళను విమర్శించే గీతం రాసి వినిపించాడు.

అందుకే ఆ మొలక విషవృక్షమైన సందర్భంలో ‘సేద్యం’ (2011)లో ఒక ప్రయోగం చేసినపుడైన ఆ ప్రయోగాన్ని ఇప్పుడు పూర్తి పుస్తక రూపంలో ప్రాజెక్ట్‌గా మన చైతన్యంలోకి తేదల్చుకుంటున్నపుడైన ఇక్బాల్‌ చెరబండరాజు ‘వందేమాతరం’లో ఎంచుకోకతప్పని ధిక్కార వ్యంగ్య వ్యంజన కవితోక్తిని ఎంచుకోక తప్పలేదు. ఇపుడిరదులో మొదటిగా చేర్చిన ‘సారే జహాసే నీచా’ ‘హిందూసితా నేతా’ తెలుగు ప్రక్రియలల్లో పందొమ్మిది వందల నలభైలలో, ఏభైలలో ప్రచలితమైన ప్యారడీ వంటిది కూడా కాదు. శ్రీశ్రీ ‘దేశ చరితలు’ వంటి చాలా కవితలకు మాచిరాజు దేవీ ప్రసాద్‌, జలసూత్రం రుక్మిణినాథ శాస్త్రి వంటి వాళ్లు ప్యారడీలు రాసి కూడా చాలా ప్రసిద్ధమయ్యారు. కాని చెర ‘వందేమాతరమ్‌’ అయిన ఇక్బాల్‌ ఈ గీతమైనా అంతఃసూత్రమే కాదు. ఒక ధిక్కార ప్రత్యామ్నాయం. ఒక ధిక్కార ప్రతిపాదన. అది విప్లవ దృక్పథం నుంచి విశ్లేషణ. మళ్ళీ మళ్ళీ దేశ విభజన వాదానికే వెళనక్కరలేదు. ఎందుకంటే 1935 నుంచి దేశ విభజన కాలం దాకా ప్రేమ్‌చంద్‌, సజ్జాద్‌, జహీర్‌, బల్‌రాజ్‌ సాహ్నీ, భీష్మసాహ్నీ, కె.ఎ.అబ్బాస్‌, ఫైజ్‌, కైఫీ అజ్మీ మగ్దూం వరకు ఎందరో ఉర్దూ హిందుస్థానీలో రాసిన కవులు, రచయితల వలె 1992 బాబ్రీమసీదు విధ్వంసం కాలం నుంచి గుజరాత్‌ నరమేధం నుంచి 2014 దాకా దేశం అనుభవించిన సంక్షోభం హిందీ`హిందీ`హిందుస్థాన్‌ ` అనే భావాలకు ముస్లింలు మాత్రమే కాదు, దళితులు మాత్రమే కాదు, లౌకిక భావాలు కలవారు మొదలు, ప్రజాస్వామ్య వాదుల వరకు ఒక వైఖరి తీసుకోవల్సిన స్థితి వచ్చింది. అది గుర్తు చేయదలుచుకున్నాడు సేద్యం కాలానికే ఇక్బాల్‌. అది ఎందుకో మన మనస్సుల్లో రికార్డు కాలేదు.

మనం విన్న మోడీ ఎన్నికల ప్రచార విషప్రచార సారాంశానికంతా ఒక రూపం ఇవ్వగల కవిత ` పర్సానిఫికేషన్‌ అంటారే `

అడాల్ఫ్‌ మోడీ అన్నట్లు

(అభివృద్ధి ` డెవలప్‌మెంట్‌ మాడల్‌కు మత ఉన్మాద మూఢత్వానికి మోడీ అనే పేరు పెట్టినట్లు)

ఈ సారే జహాఁసే నీచా `

ఇవ్వాళ హిందూ సితాక నేతా... హిందూ దేశ పాలకుడు...

సారే జహాఁ సే నీచా...

ఖూన్‌ బీ ఖుషీసే పీతా

జాన్‌ భీ మజేసే లేతా

దౌలత్‌ వతన్‌ కి ఛీన్తా

ఇజ్జత్‌ అవాంకి లూట్తా

చున్‌ తీమె ఆకె మిల్తా

గిన్తీ సే గయబ్‌ హోతా

లోకంలోకెల్లా నీచుడు

హిందూ దేశ పాలకుడు

రక్తమైనా రంజుగా జుర్రుతడు

ప్రాణాలను పసందుగ తీస్తడు

ప్రజల మానాలు దోస్తడు

ఎన్నికల్లో వచ్చి కలిసేడు

కౌంటింగుతో కనుమరుగయ్యేడు

అట్లని భయపెట్టడమో, నిరాశా వాదమో ఇక్బాల్‌ తత్వమే కాదు

జఖ్మీ బన్గయీహై

ఏ మాకీ గోద్‌ అప్నీ

ఆజాది వతన్‌ కె ఖాతిర్‌

షహీద్‌ హోన బెహతర్‌

రక్త సిక్తమై అల్లాడుతున్నది

మన నేల మనకనే స్వాతంత్య్ర కాంక్షతో

ప్రాణమెంతటిదంటు పోరు జేద్దాం

జంజీర్‌ తోడ్‌లేనా

ఔ జార్‌ తేజ్‌ కర్నా

సంకెళ్లు తెంచుకుందాం...

పనిముట్లు పదును పెడదాం...

ఈ హిందూస్థాన్‌ పాలకుని పట్లనే ఒక కసి, కోపం, ధిక్కారం కాని, వతన్‌ పట్ల, అంటే దేశం పట్ల, అమ్మ ఒడిపట్ల ఆ అమ్మ ఒడిలోని ఆటపాటల పిల్లల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు, కరుణ, వాత్సల్యాలు, వాళ్ల కోసం ప్రాణాలు ఒడ్డి షహీదులమైన మంచిదే కానీ సంకెళ్ళు తెంచుకొని పనిముట్లకు పనిపెడదాం అంటున్నాడు. ఈ కవిత్వంలో పరుచుకున్న కవి ఆత్మ (స్వభావ మనండీ, చైతన్యీకరణం చెందిన సంస్కృతి అనండి) ఆ మేరకు విప్లవ భావనతో ప్రజల ఐక్యత కోరిన ఎందరో కవులను అల్లామా ఇక్బాల్‌, నజ్రుల్‌ ఇస్లాం, ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌, గద్దర్‌, చెరబండరాజులను ఆయా కవితలను చదివినప్పుడు మన మనసులలో ప్రవేశపెడుతుంది. పోలిక కోసం కాదు. ఈ అల్లాడే తపన. హిందుత్వ దాడి నుంచి ప్రజలను రక్షించుకోవాలన్న తపన... ఈ కవులందరిలో మూలధాతువు.

ఈ భావజాలం తనకు సన్నిహితంగా తెలిసి 1980ల నుంచే గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలలోనయితే 1968 నాటికే ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలతో ఘర్షణపడుతున్నారన్న ఎరుకవల్ల తన జీవితానుభవం వల్ల ఇక్బాల్‌ తెలుగు పాఠకులకు అందుతున్న ఈ విప్లవ భావజాలం ఉర్దూ తప్ప చదువులేని, అర్థం చేసుకోలేని పాఠకుల కోసం, శ్రోతల కోసం, ఆ భాషలో రాయడమే కాదు ఆ లిపిలో కూడా రాయాలని ఎంచుకున్నాడు. 1950 తరువాత అటువంటి తరం చదువులో తగ్గుతూ రావచ్చు కాని లక్షలాది మంది హైదరాబాదులో ఉన్న దళిత, ముస్లిం కుటుంబాలలో ఇప్పటికీ ఉండే ఉంటారు. అంతేకాకుండా అఖిల భారత స్థాయిలో ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ థియేటర్స్‌ తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత 1951 నుంచే ప్రజాసాహిత్య, సాంస్కృతిక కార్యక్షేత్రానికి దూరమవుతూ 1956 నుంచే రివిజనిస్టు రాజకీయాల కొమ్ము కాయడంలో ముఖ్యంగా ఉర్దూ పాఠకులకు ప్రత్యామ్నాయ భావజాలంతో సంభాషణకు అవకాశాలు తగ్గుతూ పోతున్నాయి. ఇక విరసం ఆరంభం నుండే ఉర్దూ భాషీయులతో కూడా ఎక్కువ ఇంగ్లీషు, తెలుగులలో లేదా తమకు తెలిసిన (ఎక్కువగా సినిమాల నుంచి) హిందీ లేదా హిందూస్థానీలో సంభాషించడం ప్రారంభించారు.

1950ల నుంచే మరీ ముఖ్యంగా 60ల నుంచి విస్తృతంగా పాకెట్‌ పుస్తకాల రూపంలో అప్పటి దాకా ఉర్దూలో ఉన్న ప్రగతిపర భావజాలం దేవనాగరి లిపితో రావడం ప్రారంభమైంది. సదాశివ వంటి తెలుగు లిపిలో పారశీక, అరబిక్‌, ఉర్దూ భాషలను పరిచయం చేసినట్లుగా ఇక్బాల్‌ తన విప్లవ కవిత్వానికి సేద్యం కన్నా ఎక్కువగా కళ చెదరని స్వప్నంలో ఆ ప్రయోగం చేసాడు. అటువంటి కవితలు అందులో 11 ఉన్నాయి. అయితే సహజంగానే ఆయన కవిత్వాన్ని పరిచయం చేసిన సాహిత్య విమర్శకులు అందరూ ఆయన తెలుగు కవిత్వ పరామర్శనే చేశారు. వాళ్ళకే కాదు నాకు కూడా ఆయన ఉర్దూ కవిత్వాన్ని ఉర్దూ కవిత్వ విమర్శ తూనిక రాళ్ళతో కొలిచే అర్హత లేదని వినమ్రంగా అంగీకరిస్తూనే వాటి తెలుగు అనువాదం చదువుతున్న క్రమంలో ఉర్దూ కవితల్లోకి పోతూ అవి మన ఉచ్ఛారణలో మనకెట్లా వినిపిస్తున్నాయో, మన గుండెలయలను ఎట్లా స్పందింప చేస్తున్నాయో తద్వారా ఏ విప్లవ సందేశాన్నిస్తున్నాయో అని బేరీజు వేయడం వస్తు, దృక్పథాల రీత్యా కూడా అవసరం.

‘కళ చెదరని స్వప్నం’ తన తలిదండ్రులకు, అల్పాయుష్కుడు అకస్మాత్తుగా వదిలిపోయిన తమ్మునికి అంకితం ఇస్తూ ఇలా రాసుకున్నాడు ఇక్బాల్‌.

కల్లోలమైన జీవితంలో కన్నీళ్లే కాదు. కడుపాకలి తీర్చే కళ్ళాలు ఉన్నాయని మధుర జ్ఞాపకాలు మిగిల్చి దారీ, దీపమూ అన్నీ తానే అయి తన తోబుట్టువు అడవిని అమ్మగా మాకిచ్చిపోయిన అమ్మీకీ, అబ్బాకూ, విడదీయని బంధమై వాళ్ళకు తోడై వెళ్లిన తమ్ముడు అన్వర్‌కూ అని వాళ్ళ ఫోటోలు కూడా ప్రచురించాడు. ఆ కల్లోల కళ్ళాల ధాన్యాన్ని పొలంలోనే శుభ్రం చేసి మొత్తం నిలువ ఉంచే స్థలంలో బండ్లకెత్తే పంట దొరల గరిసెలనే నింపుతుంది గానీ తమకు మిగిలేది పరిగె ఏరుకునే మధుర జ్ఞాపకమే. మధుర జ్ఞాపకం ఎందుకయిందంటే ఆ సస్య ఉత్పత్తి క్రమంలో తాము పాల్గొన్నారు.

మళ్లీ అల్లామా ఇక్బాలే బహుశా బ్రెప్ట్‌ా కన్నా, సాహిర్‌ లూథియాన్వీ కన్నా, దాశరధికన్నా ముందుగానే అవిభక్త పంజాబ్‌ రైతులు వ్యవసాయ కార్మికుల అనుభవం నుంచి చెప్పినట్లుగా... నీ నోట్లోకి, నీ కడుపులోకి రాని ‘ఫసల్‌’ (పంటను) కాలబెట్టే అధికారం నీకు స్పష్టంగా ఉంది. ఆ వినిర్మాణ విధ్వంసం నుంచి ఒక నూతన నిర్మాణ పోరాట రూపంలోకి ‘దారి దీపాన్ని’ చూపి, తోబుట్టువు అడవిని అమ్మగా ఇచ్చిపోయారు. ఆయన తలిదండ్రులు. అందుకే ఈ కవితా సంకలనంలో ఆయన ‘మైఁ... ఆప్‌... ఔర్‌... వో!’ లో ‘మెరీ జిందగీ పసీనేకీ షాయరీ హై... షాయరీ మేరీ పసీనేకీ ధడ్‌కన్‌ హై...’ నా బతుకు చెమట కవిత్వం కవిత్వం నా చెమట గుండెలయ’ అంటాడు. ఈ కవిత వరకు అమ్మీ, అబ్బాలు, తమ్ముడు కూడా గుర్తుకొచ్చారేమో...

వతన్‌ ఛీనే

వర్దీ ఛీనే

నసల్‌ నసల్‌కీ

చైన్‌ భీ ఛీనే

కౌన్‌ సమ్జేగా

కౌన్‌ సమ్జేగా

అబ్‌ క్యాహోగా

ఇస్తే జ్యాదా

జిందే జాన్‌సే

దఫ్నా రహేఁతో

కౌన్‌ రోకేగా

కౌన్‌ రోకేగా

ఔర్‌ క్యా లూట్తే

బచా క్యాహై

మాల్‌ లూటే

మౌజే లూటే

కౌన్‌ ఖడేగా సాత్‌

కౌన్‌ ఖడేగా సాత్‌

పుట్టిన గడ్డను దోచారు... తరతరాల ప్రశాంతతను దోచారు. ఇంకేం దోచేరు... మిగిలిందేమని... ఆస్థులు దోచిరి... నీడను దోచిరి.. ఎవరు నిలిచేరు తోడు...’ ‘ఎవరు నిలిచేరు తోడు’ అని ఒక విషాద మెలాంకలిలోకి వెళ్ళిపోతాడు. ‘అధికార పీఠాన్ని దోచేరు’ అంటే అసలు అధికారపీఠమే దోచేది కదా... అది పీఠం అయిందంటే దోచేదే కాని ఉర్దూలో చూడండి

అస్సీ సాల్‌కీ లంబీ ఉమర్‌

(ఎనభై ఏళ్ళ దీర్ఘ వయసులో... అధికార మార్పిడి అది)

వతన్‌ ఛీనే, వర్దీ ఛీనే

నసల్‌ నసల్‌ కీ చైన్‌ భీ ఛీనే

అబ్‌ క్యా హోగా... ఇస్సే జ్యాదా..

జిందే జాన్‌సే... దఫ్నా రహేఁతో

ఔర్‌ క్యా లూట్తే... బచా క్యాహై...

మాల్‌ లూటే... మౌజే లూటే...

అనే ఒక ధిక్కార స్వరం ఉంది. పోగొట్టుకోవడానికి ఏమీ లేని దాని తెగింపు ఉంది. అది ఉర్దూ భాషా ఉచ్ఛారణ శ్రవణ సౌందర్యం నుంచి వచ్చింది. కౌన్‌ ఖడేగా సాత్‌ అన్నప్పుడు కూడా మనకు తోడుగా పోరాటం నిలబడుతుందనిపిస్తుంది. అందుకే ఆయన కిసాన్‌ ఆందోళన రైతుల, ముఖ్యంగా పంజాబ్‌ (మూడు దోపిడీ చట్టాలకు వ్యతిరేకంగా) రైతుల పోరాటం గురించి ‘ముఠ్ఠీ భర్‌కీ దేశ్‌ కీ మిఠ్ఠీ అబ్‌ రండా బన్గయీ’ పిడికిటి మట్టి పోరు జెండైంది. అని కవితను ముగిస్తాడు.

కిసాన్‌ హై హం కిసాన్‌ హై

హాఁ హాఁ మమ్తాకే నిషాన్‌ హై!

జాన్‌ బనే, జమీన్‌ బనే

సారే ఆలమ్కీ సాఁస్‌ బనే

మేం రైతులం...

అవును మానవత్వానికి గుర్తులం...

జీవం అయినం... జమీను అయినం...

సకల మానవుల శ్వాసలమైనం

జాత్‌ పాత్‌కీ జాల్సే

జనతా జాగ్‌ ఉఠీ

అబ్‌ కౌన్సా జప్‌ భీ

తుజే బచానసక్తా

మతం మంటల ఉచ్చులోంచి

జాగృతమైనరు జనం ఇప్పుడు

ఇక ఏ జపమూ నిన్నాదుకోలేదు

శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటే ఒక రోజు వస్తుందనే ప్రగాఢ ఆకాంక్ష ఈ కవి ప్రతి కవితలోనూ పరుచుకొని ఉంటుంది.

‘దిన్‌ ఆతా ఎక్‌ ఓ హమారా’

మాకూ ఒక రోజు వస్తుందది!

ఎందుకంటే

సునో సునో

సూరజ్‌ ఖుద్‌

హమారే పసీనేకే సమందర్‌ పర్‌హీ

జల్‌తే జాగ్తా...

వినుడు... వినుడు

సూర్యుడు సైతం

మా చెమట సంద్రంలోంచే

మండి లేచెను’.

ఇందులో

హర్‌ సపాయీమే హమ్‌

హర్‌ సజానేమేఁ హమ్‌

హర్‌ తరస్‌ మే హమ్‌

హర్‌ తడప్‌ మే హమ్‌

ఏ సపాయిలోనైనా మేమే...

ఏ అలంకరణలోనైనా మేమే...

ఏ అల్లాటలోనైనా మేమే...

అని పాలమూరు లేబరు, తెలంగాణ కష్ట జీవుల గురించి రాసిన గద్దర్‌ పాటలను గుర్తుకు తెస్తుంది.

కశ్మీర్‌ లోయను ఆయన అసంకల్పితంగానే ‘జంగ్‌ కా మైదాన్‌’ (యుద్ధ భూమి) అన్నాడు. ఆశ్చర్యమేమంటే వాయు విమానాల్లో కూడా ఈ లోయల్లోని పూల్వామాలో భారత్‌ సర్కార్‌ మిలిటరీ పోతుంది. ఎందుకంటే వాళ్ళకు కశ్మీర్‌ పోరాట యోధులను కాల్చి చంపి ఆ భూమి ఆక్రమించి బడా దళారులకు కట్టబెట్టడంలో ఆసక్తి ఉంది. ఒక కవితలో నాకు ఇందులో కశ్మీర్‌ పై రాసిన నాలుగు కవితల్లో సుదీర్ఘంగా నాకు అక్కడ ప్రజలపై జరుగుతున్న హత్యాచారాలు, అత్యాచారాలు, శ్వాసమీద కూడా నిఘాను వివరించిన కవితలు ఇవి. ఆ వివరాలన్నీ ఎంత భావోద్వేగంతో కవిత్వీకరించబడినవో చదివి తీరాల్సిందే. జాగ్‌ ముబారక్‌ (మెలకువ అభినందన) రంజాన్‌ పండుగ రోజు ఇన్సానియత్‌కీ హోష్‌ ముబారక్‌ ‘మానవులంతా ఒకటని జ్ఞానం చాటిన సత్యాభినందన’ అని కశ్మీర్‌ ప్రజలకు ఈద్‌ ముబారక్‌ చెప్తాడు. ఆశ్చర్యంగా ఆగస్టు 5, 2019కి ముందు కూడా ఆయన అల్లకల్లోలంగా ఉన్న ప్రజల జీవితం ‘జఖ్మీ గోద్‌’ (గాయాల ఒడి) అని కవిత రాసాడు. కశ్మీర్‌ లోయను గాయల ఒడి కన్నా ఇంకా ఎట్లా అర్థం చేసుకోగలం. గాయాలే కాదు, తమ అదృశ్యమైన ఎన్‌కౌంటర్‌ అయిన బిడ్డల అమరత్వపు అమ్మ ఒడి కూడా అది. ఆర్టికల్‌ 370 రద్దు చేసినాక కశ్మీరం ఒక నిశ్శబ్ద శ్మశానంగా భారత పర్యాటక వినోద విలాస లోయగా (విశాదంగా మంచు ఇప్పుడక్కడ కురువడం లేదు).

అదానీ అంబానీల ఆక్రమిత ప్రాంతంగా మారిన తర్వాత కూడా

హం లడ్‌ తేహీ రహేఁ గే

బిఛ్‌డీ ఆజాదీకెలియే

బిగ్‌డీ ఆర్జూ కే లియే

హమారే మాసూమోఁ కే లియే...

ఔర్‌ ఔర్‌ ఉన్‌కే సప్నోఁ కేలియే

మేం పోరాడుతూనే ఉంటాం.

చేజారిపోయిన స్వేచ్ఛ కోసం...

చెల్లాచెదురైపోయిన మా బతుకు కోసం...

మా పసిబిడ్డల కోసం...

ఇంకా... ఇంకా... వాళ్ల స్వప్నాల కోసం...

2019 ఆగష్టు 5 తర్వాత కశ్మీరును, 2023 అక్టోబరు 7 తర్వాత గాజా పాలస్థీనాలను ఈ కవితలో 1948 నుండి ఈనాటికీ వర్తించే కవితలే.

ఇక్బాల్‌ విరసంలో చేరినప్పటి నుంచీ రాస్తున్న కవిత్వమంతా ‘దండకారణ్య పర్‌స్పెక్టివ్‌’ ఉన్న కవిత్వమే. మతవర్గ తత్వం మీద రాసినా, మానవ శ్రమను, ప్రకృతి సంపదను దోచే వ్యవస్థపై రాసేవయినా, కశ్మీరుపై రాసేవైనా వ్యక్తీకరణ వైవిధ్యం గురించి చెప్పాల్సిందే కాని విషయమూ, దృక్పథమూ అన్నింటానూ పరచుకున్నది ఆ విస్తారమైన అడవి. కవిత్వానికి ఇస్తున్న ప్రాణవాయువు రక్తచలనమే. ఇందులో చివరన ఉన్న రెండు ఆదివాసీ కవితలు అందుకు అద్దం పడతాయి. ఐసీ... ఐసీ... (ఇలాగే... ఇలాగే) అనే శీర్షిక చూసిన విశ్వజనీనమైన గతితార్కిక శ్రమ నుంచి వికసించే చైతన్యం గురించి చెప్పినా అది అడవి బిడ్డల, తల్లుల జీవన చిత్రం నుంచి మల్చి వచ్చి ఆక్రమించి ఇల్లు దోచి, ఇజ్జత్‌ దోచి కంపెనీల కోసం అడవిని దోచి పెట్టే బీభత్స దృశ్యాన్ని చెప్పి పోరాడి నేర్చుకున్న పోరాట పాఠం గురించి చెప్పడమే. అద్భుతమైన కవిత ఇది. ఆయనకే అనిపించినట్లున్నది.

తునికి పొదల ఎదల లేచిగురుల వాక్కిది అని కింద ఒక నోట్‌ రాస్తాడు. నాకయితే ఒక్కసారే బీజాపూర్‌లో తునికాకు ఏరబోయిన ఆదివాసులపై జరిగిన మారణకాండ గుర్తుకొచ్చింది. మూలవాసీ మంచ్‌ యువకుల నోట ఈ గాథలన్నీ హార్తే హార్తే జీత్నా సీఖే, హర్‌ హార్‌ జోడ్కే జుల్మ్‌ మిటానే సీఖే ` అన్నిటికన్న, ‘ఖాబోఁకీ దునియాఁ ఘర్‌ బసాన సీఖే ఓడిపోతూ ఓడిపోతూ అలాగే గెలవడం నేర్చినం ` మా బతుకులను సాకారం చేసుకోవడం నేర్చినం అని వింటున్నట్లుగానే ఉంది.

విని మనమేం చేయాలి మన ఊళ్ళల్లో పెద్దలు చెప్పినట్లు మాట్లాడకపోతే సమ్జోవో ముర్దేమే జమా.. అర్థం చేస్కోకపోతే పక్కా, వాడు మాట్లాడకపోతే శవంగా లెక్క. నేననడం లేదిది. పెద్దల వాక్కు. ఫైజ్‌ను గుర్తుకు తెచ్చే ఇక్బాల్‌ మాటలతో ముగిస్తాను...

కుచ్‌ బోలో... బోల్నెకీ తాఖత్‌ ఖతం హోనేసే పహలే...

కుచ్‌ సునావో... సున్‌నేకీ హాలాత్‌ బిగడ్నేసే పహలే..

ఏమైనా వినిపించు వినే సత్తువ సత్తు బారక ముందే...

గుండెలోని నిప్పుని రాజేద్దాం... ఉదయాలను పండిద్దాం!

ఎందుకంటే

కల్కె జైసా ఆజ్‌ న రహా

ఆజ్‌ కే జైసా కల్‌ న హోగా

కలీ... పూల్‌... కైరీ... ఫల్‌

బీజ్‌ దానా... ఉగ్తా పౌధా

నిన్నటి లాగ ఇవ్వాళ లేదు

ఇవ్వాళ లాగా రేపుండకపోవచ్చు

మొగ్గ... పువ్వు... పిందె... పండు విత్తు...

విత్తనంలోంచి ఎదిగే మొక్క

బాదల్‌ ఛాయీ

ఆస్మాన్‌ గర్జీ

ఆనేవాలా అందాజ్‌ బారిష్‌

బైల్‌ బండీ నాగర్‌ తయ్యార్‌

డర్‌క్యోఁ జాతా

జాగ్తా కిసాన్‌

మబ్బులు నిండి ఆకాశం ఉరిమింది

వానొచ్చే ఆనవాళ్లు కమ్మినయ్‌

ఎద్దులు... బండి... నాగలి... తయారైనయ్‌

ఎదవడడు రైతు... రణానికి రుమాలు గడ్తడు

నేలరాలిన విత్తు ఎంత కాలముంటుంది అణిగి

పొరలు చీల్చుకు నవ్వుతూ మొలుచుకొస్తది

కన్నీరు తుడిచి ఊపిరులంది

పుచ్చుకుంటది

గుండెగాయాల

బదులు బాకీ తీర్చుకు తీర్తది

ఫెలో ట్రావెలర్‌

(విరసం సీనియర్‌ కవి ఇక్బాల్‌ అపూర్వ సాహసిక ఉర్దూ కవితా సంకలనం ఉర్దూ తెలుగు ఇంగ్లీషు భాషల్లో వెలువడుతున్న సందర్బంగా.. ఆ పుస్తకానికి సాహితీ మిత్రులు ‘ఫెలో ట్రావెలర్’ రాసిన ముందుమాటలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం)

ఉర్దూ మూల కవిత్వం, తెలుగు అనువాదం.. ఇక్బాల్

ఆంగ్ల అనువాదం - అర్విణి రాజేంద్రబాబు

హిందీ అనువాదం - ఎస్. ఫరీదా బాను

ఇక్బాల్,

94407 75732

Advertisement

Next Story

Most Viewed