ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి

by Sridhar Babu |
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి
X

దిశ, కాగజ్ నగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రజలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణం తోపాటు మున్సిపాలిటీ, మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని దాహేగాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు చెల్లింపులు చేస్తున్నట్టు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మద్దతు ధర కల్పించిందన్నారు. వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

తాగునీరు, నీడ, గన్నీ సంచులు, తార్పాలిన్ అందుబాటులో ఉంచడంతోపాటు తేమ, తూకం, యంత్రాలు, ఇతర అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యత, సామాగ్రి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సకాలంలో అందించేందుకు కృషి చేయాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు నాణ్యమైన సరుకులను వినియోగించేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు.

అనంతరం కాగజ్ నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. జిల్లాలో ఈనెల 17, 18 వ తేదీలలో జరగనున్న గ్రూప్ త్రీ పరీక్ష కొరకు అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రూప్ త్రీ పరీక్ష కొరకు జిల్లాలో 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పాఠశాలలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గదులలో ఫర్నిచర్, ఫ్యాన్లు వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి కాగజ్నగర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రబ్బాని, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి మనోహర్, గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story