ఇటిక్యాల చెరువుపై ఎఫ్టీఎల్ వివాదం.

by Aamani |
ఇటిక్యాల చెరువుపై ఎఫ్టీఎల్ వివాదం.
X

దిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు కి ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) హద్దుల నిర్ణయం అధికారులకు సవాల్ గా మారింది. అప్పట్లోనే చెరువు శిఖానికి బౌండరీ ని ఫిక్స్ చేసిన అధికారులు,చెరువుకి ఎఫ్టీఎల్ హద్దులు పూర్తిస్థాయిలో నిర్ణయించడంలో విఫలమయ్యారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే చెరువు చుట్టూ ఉన్న భూములకు భారీ డిమాండ్ రావడంతో ఇక్కడ రియల్టర్లు ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు వేసి ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో చెరువుకి ఎఫ్టిఎల్, బఫర్ జోన్లను నిర్ణయించే విషయంలో అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. పట్టాదారులందరికీ కాకుండా కొంతమందికే నోటీసులు ఇచ్చి గతంలో రెండు సార్లు ఎఫ్టీఎల్ హద్దుల సర్వేకు వచ్చిన అధికారులకు, పట్టాదారులకు మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో పూర్తి స్థాయిలో సర్వే జరగకపోగా, వివాదానికి దారి తీసింది. వీలైనంత త్వరగా హద్దులు పూర్తిస్థాయిలో గుర్తించి వేయకపోతే వాటి పరిధిలో అక్రమ వెంచర్లు, నిర్మాణాలు జరిగి భవిష్యత్తులో చెరువు మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.

ఏం జరుగుతోంది..

ఇటిక్యాల చెరువు శిఖం సర్వే నెంబర్ 333 లో 42.36 ఎకరాలు, సర్వే నెంబర్ 9 లో 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. మొత్తంగా 67.36 ఎకరాల విస్తీర్ణంలో శిఖం ఉంది. చెరువు చుట్టూ ఇటిక్యాల, లక్షెట్టిపేట, ఊత్కూర్ గ్రామాలకి చెందిన రైతుల పట్టా భూములు ఉన్నాయి. చెరువుకి బ్యాక్ వాటర్ నిలిచే వైపున భూములకు ఒక్కసారిగా మంచి డిమాండ్ వచ్చింది. గుంటకి రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగానే ధర పలుకుతోంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఆ భూములు వస్తాయని, రియల్టర్లు వెంచర్లు వేసి ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని పలువురు ఫిర్యాదులు లేవనెత్తడంతో వివాదం తలెత్తుతోంది. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖాధికారులు, రెవెన్యూ శాఖాధికారుల సమన్వయంతో 2018 లో ఒకసారి, 2021లో రెండోసారి ఎఫ్టీఎల్ హద్దులు వేసేందుకు సర్వే చేశారు. కాగా, చెరువు శిఖం చుట్టూ ఆనుకుని ఉన్న పట్టాదారులందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే నోటీసులు ఇచ్చి కొన్ని సర్వే నెంబర్లకు మాత్రమే హద్దులు నిర్ణయించిన అధికారులు చెరువుకి పూర్తిస్థాయిలో హద్దులు వేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయాన్ని అటు ఉంచితే, 2021 ఏప్రిల్ నెలలో చెరువు శిఖానికి బౌండరీ ని రెవెన్యూ అధికారులు ఫిక్స్ చేశారు. చెరువు మాత్రం ఎలాంటి కబ్జాకు గురికాలేదని అప్పటి తహసీల్దార్ రాజకుమార్ ఉన్నతాధికారులకు నివేదిక సైతం పంపించారు. హద్దులు వేసిన తర్వాత చెరువుకి భద్రత వలయంగా బఫర్ జోన్ ను నిర్ణయించాల్సి ఉంటుంది. చెరువు శిఖం 25 ఎకరాల విస్తీర్ణం కి పైగా ఉండటంతో నిబంధనల ప్రకారం చెరువుకు ఎఫ్టీఎల్ ను నిర్ణయించిన తర్వాత 30 మీటర్ల వెడల్పుతో బఫర్ జోన్ ను గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా పూర్తిస్థాయిలో ఎఫ్టీఎల్ పరిధినే నిర్ణయించకపోవడంతో బఫర్ జోన్ గుర్తింపు ఎప్పుడు చేస్తారనే సందేహం నెలకొంది.

గతంలో కంటే బ్యాక్ వాటర్ పెరగడం వల్లే..

చెరువుకు గతంలో ఉన్న పాత మత్తడి(అలుగు)పై ఎత్తును పెంచి కొత్త మత్తడిని నిర్మించడం వల్లనే చెరువు చుట్టూ బ్యాక్ వాటర్ భారీగా పెరిగి నీరు పోటు కమ్ముతున్నదని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంపల పల్లి చెరువు నుంచి ఇతర చెరువులకు వెళ్లే కాలువలు ఆక్రమణకు గురి కావడంతో అటు వైపు వెళ్లే వరద నీరు కూడా భారీగా ఇటిక్యాల చెరువులోకి వచ్చి చేరి తమ పట్టా భూములను అధిక శాతం ముంచెత్తు తోందని వాపోతున్నారు. గతంలో చెరువుకి ఎగువన బ్యాక్ వాటర్ నిలిచే భూముల వైపున బావులు తవ్వి వ్యవసాయం చేశామని రైతులంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత పదేళ్లుగా బ్యాక్ వాటర్ పెరిగి తమ భూముల్లో నిలుస్తుండడంతో కొందరు కావాల్సుకొని ఎఫ్టిఎల్ పరిధిలో తమ భూములు ఉన్నాయని ఫిర్యాదు చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. చెరువుకి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల వద్ద ఉన్న పాత రికార్డుల ఆధారంగా ముందుగా తమకు నోటీసులు ఇచ్చి ఆ శాఖల్లోని నిపుణులైన అధికారులచే చెరువు పై అధ్యయనం చేయించి ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించాలనే డిమాండ్ పలువురు నుంచి వ్యక్తమవుతోంది. సమస్యగా మారిన చెరువు ఎఫ్టీఎల్ హద్దుల నిర్ణయం విషయంలో అధికారులు ఏ విధంగా పరిష్కరించి వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed