ట్రిపుల్ ఐటీ తీరు మారదా..ఇక్కడే ఎందుకిలా?

by Aamani |
ట్రిపుల్ ఐటీ తీరు మారదా..ఇక్కడే ఎందుకిలా?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ తీరు మారడం లేదు. ట్రిపుట్‌ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడేళ్ల కాలంలో 9 మంది విద్యార్థులు క్యాంప్‌సలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న విద్యార్థులు తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో చివరకు వైస్ ఛాన్స్ లర్ ను మార్చి కొత్త వీసీని నియమించారు. కొత్త వీసీ నియామకంతో ఇక సమస్యలన్నీ సమసి పోయినట్లేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబరపడుతున్న సమయంలో తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతున్నది. సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్, సీనియర్ల ఆగడాలు వెరసి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా అధికారులు కఠిన చర్యలు తీసుకోని కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. త్రిబుల్ ఐటీ లో గట్టి నిఘా వ్యవస్థ లేకపోవడమే తరచుగా అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బాసర ఉన్నత విద్యాసంస్థ మసకబారుతుండడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

వరుస ఘటనలతో ఆందోళన..

బాసర త్రిబుల్ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికంగా ఉంటుందన్న భావన అందరిలో ఉండేది. బాసర తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు త్రిబుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ ఆంధ్ర సహా తెలంగాణలో ఈ ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశారు. ఈ మూడింటిలో కొత్తగా ఏర్పాటు అయిన ట్రిపుల్ ఐటీలలో ఎక్కడ కూడా తరచూ వివాదాస్పద ఘటనలు, ఆత్మహత్యలు జరగడం లేదు. బాసర ట్రిపుల్ ఐటీ లో మాత్రం వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

గట్టి నిఘా లేకపోవడమే కారణమా..?

బాసర త్రిబుల్ ఐటీ లో తరచుగా అనేక వివాదాస్పద ఘటనలు జరగడానికి గట్టి నిఘా వ్యవస్థ లేకపోవడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వైస్ ఛాన్స్ లర్ పని తీరుపై అనేక ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కొత్త వీసీని నియమించింది. ప్రొఫెసర్ గోవర్ధన్ ఇంచార్జ్ విసిగా బాధ్యతలను చేపట్టారు. ఆయన నియామకంతో బాసర ట్రిబుల్ ఐటీ లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని నిరంతర పాలన వ్యవస్థను మెరుగుపరిచి బాసర ట్రిబుల్ ఐటీ ని గాడిలో పెడతారని విద్యార్థులు తల్లిదండ్రులు భావించారు. ఆయన ఇటీవలనే బాధ్యతలను చేపట్టగా... కొద్ది రోజుల వ్యవధిలోనే పూరి స్వాతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతున్నది. ట్రిబుల్ ఐటీలో నిఘా వ్యవస్థ వైఫల్యం కారణంగానే తరచుగా ఇలాంటి వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.

ముఖ్యంగా ఇంటర్ స్థాయి విద్యార్థులకు సెల్ ఫోన్ అనుమతి పట్ల భిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు వినియోగించిన ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే యూనివర్సిటీ అధికారులు పోలీసులు సైకాలజిస్టులతో విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించినప్పటికీ... విద్యార్థులపై నిఘా పెంచడం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఇది విద్యార్థులు పెడదోవ పట్టడానికి కారణం అవుతోందన్న చర్చ కూడా ఉంది. తక్షణమే యూనివర్సిటీ వీసీ సహా ఉన్నత స్థాయి యంత్రాంగం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరికొత్త ప్రణాళికను నిర్ణయించి అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed