బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి

by Shiva |   ( Updated:2023-08-21 12:41:51.0  )
బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి
X

దిశ, ఇచ్చోడ : సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జాదవ్ పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కు ఈసారి మొండిచేయి చూపారు.

ఇద్దరికి ఎదురు దెబ్బ..

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత రెండు సార్లు ఎమ్మెల్యే గా రాథోడ్ బాపురావ్ గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశించారు. మరోవైపు మాజీ మంత్రి, మాజీ ఎంపీ గోడం నగేష్ కూడా ఎమ్మెల్యే టికెట్ పై మొదటి నుంచి గంపెడాశలు పెట్టుకున్నారు. ఈసారి ఖచ్ఛితంగా మాజీ ఎంపీ గోడం నగేష్ కు టికెట్ వస్తుందని అనుచరులు, నాయకులు జోరుగా ప్రచారం చేశారు. సీనియర్ నేతలు, బలమైన క్యాడర్ కలిగి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీని కాదని, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ వైపు మొగ్గు చూపారు. బోథ్ నియోజకవర్గంలో మొదటి నుంచి సీఎం కేసీఆర్ సొంతంగా సర్వేలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్నారు. ఈ సారి బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు తథ్యమని అధిష్టానం భావించింది.

ఎమ్మెల్యేకు బుజ్జగింపులు..

సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కు సోమవారం తెల్లవారుజామున మరోసారి ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తాజాగా నిర్వహించిన సర్వేలో వ్యతిరేకత ఉందని, ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు తప్పదని సిట్టింగ్ ఎమ్మెల్యే తో చెప్పినట్లు సమాచారం. అతడిని ఎమ్మెల్సీగా నియమిస్తామని, బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపుకు సహకరించాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఇటు ఎమ్మెల్యే, అటు మాజీ ఎంపీకి టికెట్ రాలేకపోవడంతో ఇరు వర్గాల అనుచరులు, నాయకులు, కార్యకర్తలు నిరాశకు లోనయ్యారు. టికెట్ విషయంలో ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, ఇద్దరికీ టికెట్ రాలేకపోవడం రాజకీయ విశ్లేశకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story