తేనెటీగల పెంపకం ఎంతో లాభదాయకం

by Sridhar Babu |
తేనెటీగల పెంపకం ఎంతో లాభదాయకం
X

దిశ, ఉట్నూర్ : తేనెటీగల పెంపకం ఎంతో లాభదాయకమని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా అన్నారు. తేనెటీగల పెంపకానికి గిరిజన యువతీ, యువకులను ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ(సీడబ్లూఎస్) సంస్థ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై ఉట్నూర్ లోని కుమురం భీమ్ కాంప్లెక్స్ లో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. చివరి రోజు పీఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాణ్యమైన తేనెకు బహిరంగ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉందని, మంచి ఆదాయం పొందటంతో పాటు, పది మందికి ఉపాధి చూపించవచ్చని పీఓ ఖుష్బూ గుప్తా స్పష్టం చేశారు.

ఆసక్తి కలిగిన గిరిజన యువతీయువకులకు ఐటీడీఏ సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు ఉద్యాన అధికారి (పీహెచ్ఓ)సందీప్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తి కలిగిన రైతులకు ఉద్యాన శాఖ, ఖాదీ విలేజ్ బోర్డు ద్వారా సబ్సిడీ కూడా వస్తుందని, పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత తేనె టీగల పెంపకం చేపట్టాలని సూచించారు. తేనె పట్టు నుండి తేనెని ఎలా సేకరించాలో ప్రయోగత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీడబ్లూఎస్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ట్రైనర్లు రమేష్, శ్రీకాంత్, సిబ్బంది శ్యామల అశోక్, తిరుపతి, దిగంబర్, కైలాష్, నాగోరావ్, దివ్య, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Next Story