ఆదిలాబాద్ స్థానిక సంస్థల ‘మండలి’ పోరు మళ్లీ తప్పదా..?

by Disha Web Desk 12 |
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ‘మండలి’ పోరు మళ్లీ తప్పదా..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర కలకలం రేపింది. తాజా పరిణామాలు ఆదిలాబాద్ స్థానిక సంస్థల మండలి ఎన్నికలు మళ్లీ తప్పవా అన్నట్లు ప్రచారం మొదలైంది. అప్పటి భారత్ రాష్ట్ర సమితి పార్టీ అధికార బలంతో దండే విఠల్‌ను ఏకగ్రీవం చేసే విషయంలో అడ్డదారులు తొక్కిందని, సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్ విత్ డ్రా చేశారని ఆరోపిస్తూ ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సారంగాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా హైకోర్టు ఆ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం కలకలం రేపుతోంది. దండె విఠల్ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు నాలుగు వారాలపాటు ఆ ఉత్తర్వులను హైకోర్టు సస్పెన్షన్‌లో ఉంచింది. హైకోర్టు ఇచ్చిన రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తానని, సుప్రీం కోర్టుకు వెళతానని దండే విట్టల్ చెబుతుండగా... తన న్యాయపోరాటంలో విజయం సాధించానని పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి ఎమ్మెల్సీ పదవికి మళ్లీ ఎన్నికలు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు.

గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం

2022 సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎమ్మెల్సీ స్థానం కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ భారత్ రాష్ట్ర సమితి తరపున కాగజ్నగర్ కు చెందిన వ్యాపారవేత్త దండె విఠల్ పోటీ చేశారు. ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థులను బరిలో దింపలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఉట్నూర్ కు చెందిన పుష్ప వాణి సహా కొందరు నామినేషన్ వేశారు. అభ్యర్థులు అందరూ తమ నామినేషన్‌లు విత్ డ్రా చేసుకోగా దండే విట్టల్ సహా పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పుష్పవాణి ముగ్గురు బరిలో ఉన్నారు. పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కి అప్పట్లో ఈటల రాజేందర్ తెరవెనుక నుండి మద్దతుగా ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన బలమైన అభ్యర్థిగా మారారు. ఈ క్రమంలోనే పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డిని బరిలో నుంచి తప్పించేందుకు ఆయన సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీనిపై పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ తో పాటు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారని అప్పటి ఎన్నికల అధికారి ప్రకటించగా దండే విట్టల్, పుష్పవాణి నడుమ మాత్రమే ఎన్నిక జరిగింది. భారీ మెజారిటీతో దండే విట్టల్ గెలుపొందారు. తాజాగా ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు రాజకీయంగా కలకలం రేపుతోంది. దండే విట్టల్ ఎమ్మెల్సీ పదవి కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు లోక్ సభ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ శ్రేణులను తీవ్ర నైరాశ్యంలో పడేశాయి. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం దండే విట్టల్ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు ఈ తరుణంలో హైకోర్టు తీర్పు రాజకీయంగా దండే విట్టల్ తో పాటు ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడనిదిగా తయారైంది.

మళ్లీ ఎన్నిక తప్పదా..?

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి నిర్వహించక తప్పదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైకోర్టు తీర్పుపై దండే విట్టల్ సుప్రీం కోర్టుకు వెళితే అక్కడి నుంచి వచ్చే ఫలితాన్ని బట్టి ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. అయితే వేరే అభ్యర్థి కి సంబంధించిన విషయంలో మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయని తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని తన పదవికి దోఖా ఉండబోదని దండే విట్టల్ ఆశాభావంతో ఉన్నారు. అయితే న్యాయ పోరాటంలో తాను విజయం సాధించాలని ఆదిలాబాద్ శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్లీ జరుగుతాయని పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అప్పటి ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై కూడా తాను ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ దండే విట్టల్ ఎన్నికకు సంబంధించి శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Next Story

Most Viewed