రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వమూ మార్చలేదు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

by samatah |   ( Updated:2024-05-18 06:19:38.0  )
రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వమూ మార్చలేదు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వమూ మార్చలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో గడ్కరీ ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేదు. అందులోని సెక్షన్లను మాత్రమే మార్చొచ్చు లేదా సవరించొచ్చు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఎందుకంటే వారి హయాంలో 88 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. అయినప్పటికీ వారు రాజ్యాంగాన్ని మారుస్తామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం సూత్రమని తెలిపారు. ఇది ఏ వర్గం పట్ల వివక్ష చూపకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేసిందని కొనియాడారు. నాసిక్ ప్రాంతంలో రెండు ప్రధాన పంటలైన ఉల్లిపాయలు, ద్రాక్షలను.. నిల్వ, ప్రాసెసింగ్ చేయడానికి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బీజేపీ హయాంలోనే దేశ అభివృద్ధి సాధ్యమని నొక్కి చెప్పారు. కాగా, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడానికే ఎన్నికల్లో 400 సీట్లు కావాలని అడుగుతోందని కాంగ్రెస్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గడ్కరీ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed