Relationships : అర్థం చేసుకోలేక ఆగమైతున్న సంబంధాలు.. బ్రేకప్‌లు, విడాకుల వరకూ వెళ్లకూడదంటే..

by Javid Pasha |   ( Updated:2024-05-18 05:09:30.0  )
Relationships : అర్థం చేసుకోలేక ఆగమైతున్న సంబంధాలు.. బ్రేకప్‌లు, విడాకుల వరకూ వెళ్లకూడదంటే..
X

దిశ, ఫీచర్స్ : వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కలలు గంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్ విషయానికి వస్తే ఇటీవల అనేక ధోరణులు కనిపిస్తున్నాయి. మంచి ఉద్దేశంతోనే సంబంధాలు ప్రారంభించాలని, కలకాలం కొనసాగాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆ తర్వాత ఎదురుయ్యే పరిస్థితులవల్లో, భాగస్వాముల మధ్య ఏర్పడే తగాదాలవల్లో ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఇది బ్రేకప్‌లు లేదా విడాకుల వరకూ దారితీయవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే..‘3-6-9 మంత్’ రూల్‌ అద్భుతంగా పనిచేస్తుందని రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం.

అసలు ఉద్దేశం ఇదే..

ప్రేమికులు లేదా భాగస్వాములు పరస్పరం అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టేకంటే అపార్థం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంవల్లే బ్రేకప్‌లు, డివోర్స్ వంటి అంశాలు ముందుకు వస్తాయి. అయితే ఇటువంటి పరిస్థితిని నివారించడం మన చేతుల్లోనే ఉందంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. బంధాలను బలోపేతం చేయడానికి ‘3-6-9 మంత్’ రూల్‌ ఫాలో అవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రజెంట్ డేటింగ్ కల్చర్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సరికొత్త రూల్ ఉద్దేశమేమిటో, బంధాల బలోపేతానికి ఎలా యూజ్ అవుతుందో నిపుణులు వివరిస్తున్నారు.

అర్థం చేసుకోవడం ముఖ్యం

అన్ని విధాలా తమకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడాలని, సంబంధాలు కొనసాగించాలని, డేటింగ్ చేయాలని యువతీ యువకులు ఆరాటపడుతుంటారు. ఇంత వరకూ ఓకే కానీ, ఆ ఆరాటం సక్సెస్ అయ్యాకనే అసలు ఇబ్బంది మొదలవుతుంది కొందరికి. ఇక్కడే చాలామందికి రిలేషన్‌షిప్‌ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న అనుమానం వస్తుంది. మొదట్లో ప్రతి విషయంలోనూ అర్థం చేసుకున్న వారు, క్రమంగా అపార్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. చివరికి విడాకులు లేదా బ్రేకప్ వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని అవస్థలు పడుతుంటారు. అలా జరగకుండా ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. అటువంటి రిలేషన్ షిప్ బాండింగ్‌లలో 3-6-9 రూల్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట.

‘3-6-9 మంత్’ రూల్ అంటే ఏమిటి?

బంధాలను బలోపేతం చేసే ఒక నయా ఫార్ములానే ‘3-6-9 మంత్’ రూల్. కొత్తగా రిలేషన్‌షిప్‌లోకి అడుగు పెట్టిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అసలు దీని అర్థం ఏంటంటే.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఒక్కో స్టేజ్ ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా మొదటి 3 నెలలు ఫస్ట్ స్టేజ్, తర్వాత 3 నెలలు సెకండ్ స్టేజ్, చివరి 3 లాస్ట్ స్టేజ్‌గా పరిగణించాల్సి ఉంటుంది. అంటే ఈ మూడు దశలలో భాగస్వాముల మధ్య బంధం బలోపేతం చేసే ప్లాన్ ఇక్కడ అమలు చేయాలి.

మొదటి దశలో ఏం చేస్తారు?

నిపుణుల ప్రకారం.. 3-6-9 రూల్ యొక్క మొదటి మూడు నెలల కాలాన్ని ‘డిస్కవరీ ఫేజ్’గా పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇది కొత్తగా సంబంధాలు ప్రారంభించే వారికి లేదా డేటింగ్ చేసేవారికి ఉపయోగపడుతుంది. ఈ దశలో భాగస్వాముల మధ్య ఏర్పడిన పరిచయం పరస్పరం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉద్దేశించినది. ఇద్దరి మధ్య ఆసక్తులు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, భయాలు, లక్ష్యాలు ఇలా.. ప్రతీ విషయంలో ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. అలా మూడు నెలలు గడిచాక కలిసుండాలా? వద్దా అనేది నిర్ణయించుకోవాలి.

సెకండ్ స్టేజ్‌లో.. ‘డీపెనింగ్ ఫేజ్’

ఫస్ట్ 3 మంత్స్‌లో భాగస్వామిపై ఒక ఓపీనియన్ ఏర్పడుతుంది. ఇక రెండవ దశలో ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడానికి కేటాయించాలి. దీనినే డీపెనింగ్ స్టేజ్ అని కూడా పిలుస్తారు. ఒక విధంగా చెప్పాలంటే అట్రాక్షన్ స్టేజ్ దాటి మరింత డీప్‌గా అర్థం చేసుకోవడంలో ఈ దశ కీలకం. భావాలు, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఎమోషనల్ సపోర్ట్ అందించడం, సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడం ఈ దశలో ముఖ్యం. ఇందులో సక్సెస్ అయ్యే దాన్ని బట్టి మీ బంధాన్ని కొనసాగింవచ్చు.

చివరిదశ నిర్ణయమే కీలకం

‘3-6-9 రిలేషన్‌షిప్ రూల్‌లో మొదటి, రెండవ దశలు చాలా కీలకం. ఇక్కడ మీ అభిప్రాయాలు, ఆసక్తులు, అభిరుచులు కలిశాయా లేదా?.. పరస్పరం అర్థం చేసుకుంటున్నారా? లేక అపార్థం చేసుకుంటున్నారా? అనేది తేలిపోతుంది. అప్పటికే ఇద్దరి మధ్య ఒక అవగాహన ఏర్పడుతుంది. దీనిని బట్టి జీవితంలో కలిసి నడవాలా లేదా అనేది నిర్ణయించుకుంటారు. ఇలా చేయడంవల్ల ఏర్పడిన సంబంధాల్లో బ్రేకప్‌లు, విడాకులు వంటివి ఉండే అవకాశం ఉండదని, పైగా రిలేషన్‌షిప్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed