జిల్లాకో మెడికల్ కాలేజీ ఘనత బీఆర్ఎస్‌దే: Harish Rao

by Mahesh |   ( Updated:2024-09-11 15:09:09.0  )
జిల్లాకో మెడికల్ కాలేజీ ఘనత బీఆర్ఎస్‌దే: Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు ఘనత మాదేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులు ఇవ్వడం సంతోషించదగ్గ విషయం అన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో మెడికల్ కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని, దేశంలోనే రికార్డ్ నెలకొల్పిందన్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్ఎంసీ నుంచి అనుమతులు లభించాయని తెలిపారు.

నిబంధనల ప్రకారం మౌలిక వసతుల ఏర్పాటు, బోధనా సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైందని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించిందన్నారు. జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని మౌలిక వసతులు, బోధన సిబ్బందిని సమకూర్చుకుంటామని అనుమతి కోరుతూ కేంద్రానికి అప్పీల్ చేసిందని తెలిపారు. దీన్ని పరిశీలించిన కేంద్రం అప్పీల్ అంగీకరించి, 4 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని ఎన్ఎంసీకి మార్గనిర్దేశం చేసిందని, దీంతో ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం నాలుగు కాలేజీల్లో 200 సీట్లు ఈ అకడమిక్ ఇయర్ కు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కొత్త సీట్లతో కలుపుకొని తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మొత్తం సీట్ల సంఖ్య 4,090 కు చేరుకుందని వివరించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090 సీట్లకు చేరిందని, అంటే తొమ్మిదేళ్ల కాలంలో 5 రెట్లు పెంచిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పది వేల మంది పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 22 సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్లకు నిలయంగా మారిన తెలంగాణ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ రెవల్యూషన్ కి నాంది పలికిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా, వైద్య విద్య హబ్ గా ఎదిగిందని చెప్పేందుకు గర్వ పడుతున్నానన్నారు.

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు

పసికందును పీక్కుతున్న కుక్కలు అనే వార్త చూశాక నా మనసు కలచివేసిందని హరీష్ రావు అన్నారు. ఇంత హృదయ విదారక విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గం అన్నారు. కుక్క కాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60 వేలకు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిందన్నారు. కుక్కల నియంత్రణలో ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. యాంటీ రేబిస్ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని దుయ్యబట్టారు. కుక్క కాటుకు మరణించిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 50 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ లో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చెరబోతున్న 547 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed