దుండిగల్ పీఎస్ పరిధిలో యువకుడు దారుణహత్య..

by Sathputhe Rajesh |
దుండిగల్ పీఎస్ పరిధిలో యువకుడు దారుణహత్య..
X

దిశ, దుండిగల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. దాసరి శంకరమ్మ, దాసరి అంజయ్యలకు ఇద్దరు కుమారులున్నారు. 12 సంవత్సరాల క్రితం షాపూర్ నగర్ చంద్రగిరి నగర్ నుండి గాగిల్లాపూర్ 214 లో నివాసం ఉంటున్నారు. భర్త అంజయ్య ఇదివరకే మరణించారు. పెద్దకుమారుడు మానసిక స్థితి సరిగా లేదు చిన్న కుమారుడు దాసరి మల్లేష్(25) పెయింటర్‌గా పనిచేస్తూ తల్లిని పోషిస్తున్నాడు. రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదు.

ఉదయం 214 దగ్గర గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర మృతదేహం ఉండడంతో దుండిగల్ పోలీస్‌లకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఇది ముమ్మాటికీ హత్యే అని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తోటి పెయింటర్ పాషా పై అనుమానం రావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

పాషా ఒంటిపై రక్తపు మరకలు ఉండడం తలపై చిన్నపాటి గాయం ఉండడం మృతుడితో పాటు పెయింటర్‌గా పనిచేస్తుండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. స్థానికులు సైతం అతనిని విచారిస్తే పూర్తి వివరాలు బయటపడుతాయని అంటున్నారు. భర్త ఇది వరకే చనిపోవడం ఉన్న పెద్దకొడుకుకు మానసిక స్థితి సరిగాలేకపోవడం, పోషిస్తాడు అనుకున్న చిన్న కుమారుడు దారుణ హత్యకు గురికావడంతో తల్లి శంకరమ్మ ఘటనా స్థలంలో రోదించిన తీరు అందరని కలచివేసింది. అంత్యక్రియలు చేసే స్తోమత లేకపోవడంతో స్థానిక మహిళలు కార్యక్రమం చేసేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ముందుకొచ్చారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story