ఫామ్ హౌజ్ ఫైల్స్ vs లిక్కర్ గేట్.. హైదరాబాద్‌లో పోటాపోటీగా ‘‘పోస్టర్ వార్’’

by Satheesh |
ఫామ్ హౌజ్ ఫైల్స్ vs లిక్కర్ గేట్.. హైదరాబాద్‌లో పోటాపోటీగా ‘‘పోస్టర్ వార్’’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘పోస్టర్ ఫ్రీ’ సిటీ అంటూ హైదరాబాద్ నగరం గురించి ఎవరెన్ని చెప్పినా తాజా పరిస్థితి మాత్రం దానికి భిన్నం. స్వచ్ఛ హైదరాబాద్ సంగతేమోగానీ రాజకీయ అశుద్ధం మాత్రం కంపుకొడుతోంది. ఊరు, పేరు లేకుండా బీజేపీ, బీఆర్ఎస్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో (అనామకం పేరుతో) బీఎల్ సంతోష్ ఫోటోలతో పోస్టర్లు దర్శనమిస్తే.. ఇప్పుడు అదే అనామకం పేరుతో కల్వకుంట్ల కవిత లిక్కర్ రాణి అంటూ పోస్టర్లు వెలిశాయి. బీఎల్ సంతోష్‌ను పట్టిస్తే ప్రధాని మోడీ చెప్పిన నల్లధనంలోని రూ. 15 లక్షల కోట్లు ఇస్తామంటూ ఆయన ఫోటోతో ‘మోస్ట్ వాంటెడ్’ టైటిల్‌తో సిటీలోని బస్ స్టాప్‌లలో దర్శనమిస్తున్నాయి.

దీనికి పోటీగా ‘మేనేజ్‌మెంట్ కోటా.. లిక్కర్‌లో వాటా..’ పేరుతో సిటీలో పోస్టర్లు వెలిశాయి. ‘కవిత అంటే పద్యం అనుకుంటున్నారు.. కాదు మద్యం’ అంటూ ఆ పోస్టర్లలో డిస్క్రిప్షన్ కనిపిస్తున్నది. ‘తెలంగాణ తల దించుకునేలా చేసినవ్..’ అంటూ కవిత ఫోటోతో పలు బస్ స్టాప్‌లలో హఠాత్తుగా పోస్టర్లు వెలిశాయి. ఈ నెల 16న లిక్కర్ కేసులో కవితను విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీచేసిన రోజు హైదరాబాద్ సిటీలో ‘పాస్ట్ బ్రిటీష్ రూల్.. ప్రెజెంట్ బీజేపీ రూల్’ అంటూ ‘బై బై మోడీ’ హ్యాష్ ట్యాగ్‌తో వినూత్నంగా పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు సిటీకి వచ్చినప్పుడల్లా ఇలాంటి పోస్టర్లను ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులు ఊరు, పేరు లేకుండా అంటించడం రోటీన్ ప్రాక్టీసుగా మారింది. ఈ పోస్టర్లు ఎవరు అంటిస్తున్నారో, ఏ పార్టీ ఘనకార్యమో నగర ప్రజలకు తెలియందేమీ కాదు. పొలిటికల్ వార్ ఇప్పుడు పోస్టర్ వార్‌గా మారిపోయింది.

Advertisement

Next Story