ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొత్త యుద్ధం!

by Prasad Jukanti |
ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొత్త యుద్ధం!
X

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాటర్ పాలిటిక్స్ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో మొదలైన మాటల యుద్ధం తాజాగా ఉద్యమాలకు సై అనే వరకు చేరుకుంది. సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేస్తామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల్లో తన నిర్వాకం బయటపడుతుందన్న భయంతోనే బీఆర్ఎస్ బాస్ కృష్ణా నీటి విషయంలో దుష్ప్రచారానికి తెర తీశారని అధికార పక్షం దుయ్యబడుతోంది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల బాధ్యత కేఆర్ఎంబీ కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం ద్వారా దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేసీఆర్ వాదన ప్రారంభించగా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ వ్యవహారం తేల్చుతామని అధికార పక్షం ప్రకటిస్తోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల వేళ ఇరు పార్టీల మధ్య జరుగుతున్న పానీ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారాయి.

ఎత్తుకు పై ఎత్తు:
పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోష్ ను లోక్ సభ ఎన్నికల్లో చూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల చేదు ఫలితాలను మరిచిపోయేలా గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చెప్పుకున్నట్లుగా ఉత్తర తెలంగాణకు ఒరిగిన ప్రయోజనం ఏమి లేదని అంతా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తోంది. దీంతో అసలే అధికారం కోల్పోయిన బాధలో ఉన్న గులాబీ శ్రేణులకు అధికార పక్షం దూకుడు పుండుమీద కారం చల్లినట్లుగా మారిందనే చర్చ జరుగుతోంది. దీంతో అధికార పక్షం కాళేశ్వరం అక్రమాలపై ఫోకస్ పెట్టగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కృష్ణాజలాల వాదాన్ని ఎత్తుకుందనే టాక్ వినిపిస్తోంది.

డివిజన్ పాలిటిక్స్:
రాబోయే ఎంపీ ఎన్నికల వేళ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ ఇరు పార్టీలు పొలిటికల్ ఎజెండా సెట్ చేసుకుంటున్నాయి. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలోనే అప్పగించే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా కృష్ణా జలాల్లో వాటాపై పోరాటం చేస్తామని, ఈ నెల 13న నల్గొండలో భారీ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. పోరాటాలు తమకు కొత్తేమి కాదంటూ పార్టీ గత చరిత్రను మరోసారి ఉటంకించే ప్రయత్నం చేశారు. దీంతో ఓటమి నిరాశతో ఉన్న గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేందుకే కేసీఆర్ కృష్ణా జలాల పేరుతో ఉద్యమాలు చేస్తామని చెబుతున్నారని నిజానికి కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలో కేసీఆర్ ఈ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. కేసీఆర్ ప్రయత్నాన్ని తిప్పికొడతామని హెచ్చరిస్తూనే కాళేశ్వరం విషయంలో గులాబీ బాస్ ను వదిలేది లేదని తేచ్చి చెబుతోంది. దీంతో ఎంపీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలుగా మొదలవుతున్న విభజన రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ డివిజన్ పాలిటిక్స్ అంతిమంగా ఎవరికి కలిసి వస్తుంది మరెవరికి బెడిసి కొడుతుంది అనేది త్వరలోనే తేలనున్నది.

Advertisement

Next Story