HMPV : హెచ్ఎంపీవీ వైరస్ ఎఫెక్ట్..గాంధీలో ఐసోలేషన్ వార్డులు

by Y. Venkata Narasimha Reddy |
HMPV : హెచ్ఎంపీవీ వైరస్ ఎఫెక్ట్..గాంధీలో ఐసోలేషన్ వార్డులు
X

దిశ, వెబ్ డెస్క్ : హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ వ్యాప్తి పట్ల తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో 40 పడకలతో హెచ్ఎంపీవీ ఐసోలేషన్ వార్డులు(HMPV Isolation Wards) ఏర్పాటు చేసింది. ఆసుపత్రి ప్రధాన భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో 40 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరిండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. వాటిలో పురుషులకు 15, మహిళలకు 5, పిల్లలకు 20 పడకలు కేటాయించారని చెప్పారు.

హెచ్ఎంపీవీ వైరస్ కరోనా అంత ప్రమాదం కాదని, సాధారణ ఇన్ఫ్లూయెంజా మాత్రమేనని, ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురవలసిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. నివారణ చర్యలు తీసుకుంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు ఈ వైరస్​తో ఒక్క మరణం కూడా సంభవించలేదని అన్నారు. అయితే ప్రజలు ఈ రకమైన వైరస్​లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కకేసు నమోదు కాలేదన్నారు. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

కొవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో 600 ఆక్సిజన్ పడకలు, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, సుమారు 40 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గాంధీ ఆసుపత్రి నోడల్ కేంద్రంగా కోవిడ్ సమయంలో దాదాపు 50వేల మందికి చికిత్స అందించిన విషయం తెలిసిందేనన్నారు

.దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ విస్తరించే పక్షంలో నిలోఫర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో కూడా ముందస్తు ఏర్పాట్లకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా సమయంలో ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో గతంలోనే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్‌లో ఆక్సిజన్​ కోసం ప్రత్యేక ప్లాంట్లు తెచ్చారు. అలాగే ఇప్పుడు అందుకు చర్యలు చేపడుతున్నారు.

కరోనా వైరస్​ను ఎదుర్కొన్న అనుభవంతో హెచ్ఎంపీవీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెచ్ఎంపీవీ అనుమానితులు ఉంటే శాంపిళ్లు సేకరించి అవసరమైతే పుణె జాతీయ వైరాలజీ ల్యాబ్​కు పంపించాలని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed